సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అనుచరుల నివాసాల్లో ఇవ్వాల (శనివారం) ఐటీ అధికారులు రైడ్స్ జరుపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మావులో ఉన్న పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రతినిధి రాజీవ్ రారు ఇంట్లో ఆదాయపన్ను అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా మెయిన్‌పురిలోని ఆర్‌సిఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్, లక్నోలోని జైనేంద్ర యాదవ్ ఇండ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
కాగా, వీరూ సమాజ్ వాది అధినేత అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. వారణాసి నుండి వచ్చిన ఐటీ అధికారులు.. ఉదయం 7 గంటలకు షహదత్‌పూర్‌లోని రాజీవ్ నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు గురించి తెలిసిన ఎస్‌పి కార్యకర్తలు రాజీవ్ నివాసానికి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. శాంతి భద్రతలను అదుపులో తీసుకు వచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఇటు మెయిన్‌పురిలోని మనోజ్ యాదవ్ నివాసానికి 12 వాహనాలతో కూడిన కాన్వాయిలో అధికారులు వచ్చారు. నివాసాల్లో సోదాలు జరిపే సమయంలో ఇంట్లోకి ఎవ్వరినీ అనుమతించలేదు. సోదాలు నిర్వహిస్తున్న అధికారులు.. పలువురిని ప్రశ్నిస్తున్నారు.