ఉక్రెయిన్‌లో పరిణామాలపై ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అధికారికంగా స్పందించింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కేవలం వివాదంగానే పేర్కొంటూ ఏకగ్రీవ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంకోసం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియా గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నాటో కూటమిలో చేరే ప్రయత్నాలను విరమించుకోవాలని హెచ్చరిస్తూ ఉక్రెయిన్‌పై పరిమిత సైనిక చర్య చేపట్టినట్లు ప్రకటించిన రష్యా దాదాపు యుద్ధమే చేస్తోంది. రెండు దేశాల్లో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఫిబ్రవరి 24న రష్యా సైనికచర్య ప్రారంభించిన పది వారాల తరువాత భద్రతామండలి తొలిసారి అధికారికంగా స్పందించింది. శుక్రవారం ఒక సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగటాన్ని ప్రపంచ దేశాలు యుద్ధం (వార్), సంఘర్షణ (కాన్‌ఫ్లిక్ట్), దండయాత్ర (ఇన్వేసన్) గా పేర్కొంటుండగా అలాంటి పదాలేవీ లేకుండా భద్రతామండలి తన ప్రకటనలో జాగ్రత్త పడింది. తాజా పరిణామాలను ఇరుదేశాల మధ్య వివాదంగానే పరిగణించింది. ఉక్రెయిన్‌లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడటం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన భద్రతామండలి శాంతియుత పరిష్కారం కనుగునేందుకు ప్రపంచ దేశాలు కలసిరావాలని ఆ ప్రకటనలో పేర్కొంది.శుక్రవారం కొద్దిసమయం పాటు భేటీ అయిన ఐరాస భద్రతామండలి సమావేశంలో సభ్య దేశాలు ఈ మేరకు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. రష్యా దుందుడుకు చర్యను చాలా దేశాలు తప్పుబడుతూ కాల్పుల విరమణ పాటించాలని తీర్మానించేందుకు పలుసార్లు ప్రయత్నించాయి. అయితే రష్యాకు ఉన్న వీటో అధికారం వల్ల, భారత్ సహా మరికొన్ని దేశాల తటస్థ వైఖరివల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ఇప్పుడు రష్యా సైనిక చర్యను కేవలం వివాదంగానే పరిగణిస్తూ భద్రతామండలి తీర్మానం చేయడం విశేషం. ఐరాసలో నార్వే రాయబారి మోన జూల్, మెక్సికో రాయబారి జువాన్ రమోన్ డి ల ఫ్యూంటే రమిరెజ్ ఈ ఏకగ్రీవ ప్రకటనను రూపొందించారు. ఉక్రెయిన-రష్యా వివాద పరిష్కారానికి దౌత్యమార్గంలో వేసిన తొలి అడుగు ఇది అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దౌత్యపరమైన పరిష్కారం కోసం గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా భద్రతామండలి ఏకతాటిపైకి వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు.
ప్రపంచం ఏకతాటిపైకి రావాలి : గుటెరస్
కాగా భద్రతామండలి ప్రకటనపై ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ స్పందించారు. ఉక్రెయిన్‌లో తుపాకులు మూగబోయే రోజులు రావాలని, ఐక్యరాజ్య సమితి నిబంధలను గౌరవిస్తూ శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్న తన ఆకాంక్షకు అనుగుణంగా తొలిసారి భద్రతామండలి ఏకగ్రీవ ప్రకటన చేయడం శుభ పరిణామమని గుటెరస్ అన్నారు. ఉక్రెయిన్‌లో శాంతిసాధనకు ప్రపంచదేశాలు కలసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతోను ఇటీవల భేటీ అయిన గుటెరస్ యుద్ధక్షేత్రాల్లో చిక్కుకుపోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, మానవతా సాయం అందించేందుకు వీలుగా కాల్పుల విరమణ పాటించాలని కోరిన విషయం తెలిసిందే. అందుకు ఇరు దేశాలు అంగీకరించడంలో గుటెరస్ విజయం సాధించారు. ఆ మేరకు మరియపోల్‌లోని అజోవ్స్‌తల్ స్టీల్‌ప్లాంట్‌లోని బంకర్లలో చిక్కుకుపోయిన వేలాదిమందిని దశలవారీగా తరలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..