న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సాధించిన ఘన విజయం మోదీ ప్రభుత్వ విశ్వసనీయతకు, అవినీతి రహిత పాలనకు లభించిన బహుమతిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అభివర్ణించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పార్టీ గెలుపుపై స్పందిస్తూ… 2024 సార్వత్రిక ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలిచి మరోసారి బీజేపీ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో ఘన విజయానికి కారణం డబుల్ ఇంజన్ ప్రభుత్వమేనని తెలిపారు.
చత్తీస్‌గఢ్ గెలుపులో మహిళలు, గిరిజనులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం 7 నుంచి 14 కు గణనీయంగా పెరిగిందని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అతీతంగా బీజేపీకి నిశ్శబ్ద ఓటింగ్ జరిగిందని తెలిపారు. కచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 95 శాతానికి పైగా స్థానాలను బీజేపీ సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘హస్తం’ భస్మాసుర హస్తంగా మారుతుందని, త్వరలో ఇండియా కూటమి ఇంటికి పోవడం ఖాయమని ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏర్పడ్డ వ్యతిరేకతే కారణమని అన్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో మోదీ నాయకత్వాన్ని ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ ఫలితాలు నిదర్శనమని జీవీఎల్ అన్నారు. బీజేపీ – కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీతో పోటీ పడే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదని తెలిపారు. తెలంగాణలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఏర్పడిందని, అందుకే అక్కడ కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటిందని సూత్రీకరించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ స్వీప్ చేయబోతుందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 స్థానాల నుంచి 14-15 స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ భయానక ఓటమి చవిచూడబోతోందని అన్నారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓడిపోయి కూడా 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నామని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల సమయానికి తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీగా తెలంగాణ వాదాన్ని వినిపించే పార్టీ ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మారడం వల్ల ప్రజల్లో ఆకర్షణ కోల్పోయిందని జీవీఎల్ అన్నారు. తెలంగాణలోనే మనుగడ కోల్పోయిన బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో విస్తరించే ఆలోచన కొద్ది నెలల క్రితమే మానుకుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రస్తుతం ఉనికి చాటుకోడానికే కష్టపడాల్సిన స్థితిలో ఉందని అన్నారు.