ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన బ్రిటన్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుంటోంది. భవిష్యత్‌లో ఈ పశ్చిమదేశాన్ని దెబ్బతీసేందుకు పుతిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రష్యా గూఢచారుల నెట్‌వర్క్ బ్రిటన్‌లో భారీగా విస్తరించినట్లు నిఘా వర్గాల విశ్లేషణగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 1000 మందికిపైగా గూఢచారులు బ్రిటన్‌లోని వేర్వేరు సంస్థల్లో ఉన్నారని భావిస్తున్నారు. వీరిని రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ నియంత్రిస్తోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో మొత్తం 73వేల మంది రష్యా నిపుణులు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు క్రెవ్లిున్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని యూకే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. బెర్లిన్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయ సెక్యూరిటీ గార్డు ఒకరు మాస్కోకు సమాచారం పంపుతూ శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో రష్యా గూఢచర్యంపై అనుమానాలు మరింత బలపడ్డాయి.
మనీక్యాబ్ డ్రైవర్ల నుంచి బారిస్టర్ల దాకా రష్యా వేగులు ఉన్నారని గుర్తించారు. విస్తృత నెట్‌వర్క్‌ను మాస్కో ఇక్కడ నిర్మించిందని, గూఢచారులంతా సామాన్య పౌరుల్లా జీవిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది. విద్యార్థులు, ట్రేడ్ యూనియన్లు, ఉద్యమసంస్థలు, టీచర్లు, డ్రైవర్లు, రాజకీయ నాయకులు, సివిల్ సర్వీస్ సిబ్బంది, పోలీసులు ఇలా ప్రతి విభాగంలో వేగులు ఉన్నట్లు గుర్తించారు. లండన్‌లోని రష్యా రాయబార కార్యాలయ పరిధిలో పనిచేసే గూఢచారుల సంఖ్య తగ్గి, అజ్ఞాతంగా పనిచేసే వారి సంఖ్య పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది.
బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్‌ట్రస్ వ్యక్తిగత ఫోన్‌ను కూడా రష్యన్ ఏజెంట్లు హ్యాక్ చేసినట్లు వార్తలొచ్చాయి. హ్యాక్ జరిగినసమయంలో ట్రస్ బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. మిత్రదేశాలతో చర్చలకు సంబంధించి కీలక రహస్యాలు రష్యా చేతికి చేరాయని కూడా ఆ కథనం పేర్కొంది. ఏడాది కాలంలో ట్రస్ సంభాణల గుట్టంతా పుతిన్ చేతికి చేరిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నివేదిక పట్ల బ్రిటన్ అప్రమత్తమైందని, వేగులను గుర్తించే పనిని వేగవంతం చేసిందని యూకే అధికార వర్గాలు చెబుతున్నాయి.