Thursday, November 21, 2024

కేసీఆర్ తప్పిదాలతోనే వరదలు, విదేశీ కుట్ర అన‌డం హాస్యాస్పదం: బండి సంజయ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తప్పిదాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిందని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే విదేశీ కుట్ర అంటూ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలని, ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలని, కానీ కేసీఆర్ అక్కడికి వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని అన్నారు. గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చాయని, ఈసారి కూడా వచ్చాయని, భవిష్యత్తులో రావని కూడా చెప్పలేమని బండి సంజయ్ సూత్రీకరించారు. కానీ కేసీఆర్ కు మాత్రం భారీ వర్షాలు మానవ సృష్టిలా కన్పిస్తున్నాయని, పైగా పైగా విదేశాల కుట్రలంటూ మతిభ్రమించినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. తానే పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయిందని సంజయ్ అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసిందని విమర్శించారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారని, ఆ క్రమంలోనే విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాకు తెరదీశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వారం రోజులుగా వరద ముంపుతో ప్రజలు అల్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదని, జీతాలందక ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నరని చెప్పారు. జీతాలివ్వడం చేతగాక వర్షాల అంశాన్ని విదేశీ కుట్ర పేరుతో అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్ డ్రామాలు ఆపి భారీ వర్షాలకు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వేలాది మంది ముంపు బాధితులను ఏ విధంగా ఆదుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తాననడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని బండి సంజయ్ అన్నారు. “సర్వం కోల్పోయిన బాధితులకు ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుంది? పైగా గతంలో హైదరాబాద్ వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ సొంతం. చేసిన అరకొర సాయం టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిన విషయం ప్రజలింకా మరువలేదు.” అంటూ ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి సీఎం పర్యటనలో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం, బాధితుల సంఖ్యపై అంచనా వేసి, ఆర్ధిక సాయం ప్రకటిస్తారని ఆశించామని, కానీ అవేమీ లేకుండా కేసీఆర్ పర్యటన గాలి పర్యటనలా మారిందని విమర్శించారు. పైగా కరకట్టల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వడం, 10 వేల ఇండ్లతో కాలనీని నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వందలాది గ్రామాలు మంపుకు గురై వేలాది మంది నిరాశ్రయలవుతుంటే ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లోనున్న ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతూ కేంద్రాన్ని బదనాం చేసేందుకు కుట్ర చేస్తుండటం సిగ్గు చేటు అని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రాన్ని బదనాం చేసేందుకు వెచ్చిస్తున్న సమయాన్ని బాధితులను ఆదుకునేందుకు, సహాయక చర్యలపై వెచ్చిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement