సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీకి సహకరించాలని పోలీసు, రవాణా శాఖల అధికారులను కంపెనీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. దసరా కార్యక్రమాలపై సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జన్ అధ్యక్షతన పోలీసు, రవాణాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.
దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. గత దసరాతో పోలిస్తే ఈసారి మహాలక్ష్మి పథకం అమలు చేయడం కారణంగా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, గతంలో మాదిరిగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
“పండుగుల వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంతో రద్దీ దృష్ట్యా గత ఏడాదితో పోల్చితే అదనంగా 600 స్పెషల్ సర్వీసులను తిప్పాలని నిర్ణయించింది.” అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.
ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా జేబీఎస్ నుంచి 1602, ఎల్బీనగర్ నుంచి 1193, ఉప్పల్ నుంచి 585, ఆరాంఘర్ నుంచి 451 అదనపు బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణం రద్దీ ఎక్కువగా ఉండే ఈ నెల 13, 14 వ తేదిల్లోనూ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా బస్సుల కదలికలను గుర్తించేందకు గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు.
సమన్వయంగా పని చేద్దాం…
హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్ (ట్రాఫిక్) విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పండుగ వేళల్లో టీజీఎస్ఆర్టీసీకి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చడానికి టీజీఎస్ఆర్టీసీతో సమన్వయంగా పని చేస్తామని చెప్పారు.