కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే పారిశ్రామిక కారిడార్ ప్రధాన లక్ష్యమన్నారు. పారిశ్రామిక కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచుతామన్నారు.
కాగా, కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనపై సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ(యు), ఆర్‌ఎస్‌పి, సిపిఐ (ఎంఎల్-లిబరేషన్) తదితర పార్టీల నాయకుల బృందం సీఎం రేవంత్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలను వివరించారు. కొడంగల్ లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని గుర్తు చేశారు. తన సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయడం తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదన్నారు.
కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని, నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమన్నారు. భూసేకరణ విషయంలో పరిహారం పెంచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
సిపిఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితర నాయకులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.