న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్నది రైతు దీక్ష కాదు దోపిడీ దీక్ష అని టీపీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శనివారం ఆయన ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లూ కొంటానని చెప్పిన కేసీఆరే ముందుగా మొదటి గింజ కొనడం మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు వచ్చిన ధరకు తెగనమ్ముకుంటున్నారని వాపోయారు. వరిపై కనీస మద్దతు ధర రూ. 1,960 ఉంటే రూ. 1,350కి అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల రైతు ప్రతి క్వింటాకు ఆరు వందల రూపాయలు నష్టపోతున్నాడని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ మొత్తం మీద రూ. 3,600 కోట్లు రైతులు నష్టపోతున్నారని వివరించారు.
మిల్లర్ల ద్వారా ఆ సొమ్ము కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. బియ్యం కొనాలంటూ కేంద్రంపై పోరాటం చేస్తున్నామంటున్న కేసీఆర్, ఆ బియ్యం కొనాలంటే ముందు వడ్లు కొనాలన్న సంగతి ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. రైతుల వద్ద వడ్లు కొనే విషయంలో జాప్యం చేస్తూ మిల్లర్ల దోపిడీకి మార్గం వేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఖరీఫ్ సమయంలో అదనపు ధాన్యం కొనాలంటూ, అసలు ధాన్యమే కొనకుండా రైతులు మిల్లర్లకు అమ్ముకునేలా చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు ఉప్పుడు బియ్యం పంచాయితీ పెట్టి కొనడం లేదని పొన్నాల అన్నారు. బియ్యం పంచాయితీ సంగతి తర్వాత ముందు రైతుల దగ్గర వడ్లు కొనాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..