వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అంటూ కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేర ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరును విధివిధానాలను ప్రకటించబోతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు కరోనా మహమ్మారి తెలంగాణలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చింది.
ఒకవేళ అనుమతి వచ్చినా సరే పరిమిత సంఖ్యలోనే పబ్లిక్ ఉండాలంటూ సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పోలీసులు ఆ ఆంక్షలను మరింత కఠినం చేస్తున్నారు. కాగా షర్మిల బహిరంగ సభకు అనుమతిని రద్దు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో బహిరంగ సభను ఏర్పాటు… చేసి కరోనా నిబంధనలు పాటించేలా చూడటం కష్టమని అధికారులు కూడా భావిస్తున్నారట. కాగా షర్మిల టీం అనుమతి లభిస్తుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.