అమెరికాలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధిని తట్టుకుని మనిషి మనుగడ సాగించే స్థితికి అమెరికా వెళ్తోందని ఆ దేశ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికాలోని ప్రఖ్యాత సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్‌ఐఎస్)లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ను అంతం చేయడం అనేది అభూత కల్పనే అని పౌచి అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్‌కు ఉన్న వ్యాప్తి, వేగం కారణంగా అది ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యూటేషన్లు, వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తుల కారణంగా కరోనావైరస్ సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడించారు.
సమయానికి వ్యాక్సిన్లు తీసుకున్నవారు.. వైరస్ కారణంగా తలెత్తే తీవ్ర పరిణామాల నుంచి తప్పించుకుంటారు. కానీ, వ్యాక్సిన్ల సామర్థ్యం కూడా తగ్గుతోందని ఫౌచీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో దేశం కొత్త దశలోకి అడుగు పెడుతోందని అంచనా వేశారు. టీకాల కారణంగా పూర్తి రక్షణ పొందిన ప్రజలు.. ఆరోగ్య సమస్యలున్నవారు వైరస్ బారిన పడినా.. తేలిగ్గా చికిత్స చేయడానికి సరిపడా మెడిసిన్స్ ఉన్న స్థితికి దేశం చేరుతోందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు మిలియన్‌కు పైగా కేసులు.. 1,50,000 మందికి హాస్పిటళ్లలో చికిత్సలు.. 1,200 మంది ప్రాణాలు కోల్పోతుండటం వల్ల.. తాను అంచనా వేసిన స్థితికి అమెరికా ఇంకా చేరుకోలేదన్నారు.