బోథ్ : విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు గట్టి పునాది వేసేది గురుకుల పాఠశాలలేనని రాష్ట్ర దేవాదాయ అటవీ న్యాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి అనంతరం మాట్లాడారు. నాణ్యమైన విద్యతోపాటు, పౌష్టికాహారం, శారీరత్వానికి దృఢత్వానికి క్రీడలు గురుకులాల్లో నేర్పించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో గురుకులాలన్నీ అభివృద్ధి పథంలో ఉన్నాయని అందులో చదువుకునే విద్యార్థులు రాష్ట్ర, దేశ, విదేశాల్లో కూడా స్థిరపడ్డారని, దానికి కారణం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలేనని కొనియాడారు. ముఖ్యంగా గురుకుల పిల్లలకు ఇచ్చే మెనూ కేసీఆర్ స్వయంగా పరిశీలించి తయారు చేశారని, గురుకుల పిల్లలందరూ సన్న బియ్యం తినేలా చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. గురుకులాల్లోనే బోథ్ గురుకులానికి ప్రత్యేకత ఉందని చదువులో, ఆటలతో పాటు వివిధ అంశాల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందిందని దీనికి కృషిచేసిన ప్రిన్సిపల్ సువర్ణలతను, సిబ్బందిని అభినందించారు. గురుకుల కళాశాలకు అదనపు క్వార్టర్స్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అనంతరం క్రీడా సంబరాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు మాట్లాడుతూ.. మారుమూల బోథ్ గురుకులంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల అభివృద్ధికి నిదర్శమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 945 గురుకులాలను ప్రారంభించిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసుకుంటున్నామని అన్నారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు గట్టి పునాది వేసేది గురుకులాలే : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement