Friday, November 22, 2024

Big Story : కష్టాల్లో ఐటీ.. డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న ఆర్థిక మాంద్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఐటీ రంగానికి మళ్లి గడ్డు కాలం ఎదురుకానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో ప్రపంచాన్ని ముంచెత్తనుందని భావిస్తున్న ఆర్థిక మాంద్యం ఈ రంగానికే తొలుత డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కాలంలో దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి. ఐటీ రంగం ఒక్కటి మాత్రమే నిలబడడమే కాకుండా మరింత బలోపేతమైంది. అయితే, ప్రస్తుత పరిస్థితి తారుమారైంది. అమెరికాలో దిగ్గజ కంపెనీలైన ఆల్ఫాబెట్‌ ఇంక్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీల పేలవమైన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో భారత ఐటీ రంగం దిక్కుతోచని స్థితిలో పడింది.

దీంతో ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పరిస్థితేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐటీ కంపెనీలకు కరోనా తర్వాతి సానుకూల పరిస్థితి ప్రస్తుతం తలకిందులైందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ వరుస వడ్డీ రేట్ల పెంపుతో మాంద్యం ముంచుకువస్తోందని, రానున్న రోజుల్లో ఆర్థిక మాంద్యం తప్పదని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంద్యం ప్రభావం ప్రపంచ టెక్‌ దిగ్గజాలపై పడడం అప్పుడే ప్రారంభమైందని ఇటీవల ఆయా కంపెనీలు వెల్లడించిన ఆర్థిక ఫలితాల ద్వారా స్పష్టమైంది. ఈ ఫలితాలు వెల్లడైన వెంటనే అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో టెక్‌ దిగ్గజాల షేర్లు పతనమవడం ప్రారంభమైంది. ఈ ట్రెండ్‌ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పూర్తిస్థాయిలో ఐటీ రంగంపై పడనుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అమెరికా టెక్‌ దిగ్గజాల నుంచి భారత కంపెనీలకు తగ్గనున్న ప్రాజెక్టులు…
అమెరికా టెక్‌ దిగ్గజాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడడం ప్రారంభమవడంతో భారత్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఐటీ కంపెనీల వ్యాపారానికి మూలమైన అమెరికాలో ప్రాజెక్టులు తగ్గితే ఆ ప్రభావం ఇక్కడి కంపెనీలపై తీవ్రంగా పడి ఆదాయాలు తగ్గుతాయని స్థానిక కంపెనీల యాజమాన్యాలు విశ్లేషిస్తున్నాయి. ఒక్కసారి ఆదాయం తగ్గడం ప్రారంభమైతే లాభాలను కాపాడుకోవడం కోసం ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తుందని, ఇందుకోసం కంపెనీలు తొలుత ఉద్యోగుల సంఖ్యను తగ్గించి వేతన ఖర్చులు తగ్గిస్తాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

సరిగ్గా ఈ పరిణామంతోనే 2008లో గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌(జీఎఫ్‌సీ) వచ్చినపుడు వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారని వారు గుర్తుచేస్తున్నారు. ఈసారి కూడా అదే పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరప్‌లలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత ద్రవ్యోల్బణం ఉండడమే ఇందుకు కారణంగా వారు చెబుతున్నారు.

హైదరాబాద్‌కూ తగ్గనున్న కొత్త పెట్టుబడులు….
తెలంగాణ రాష్ట్రానికి గడిచిన రెండు దశాబ్దాలుగా వచ్చే పెట్టుబడుల్లో ఎక్కువ శాతం ఐటీ రంగం నుంచే వచ్చేదే కావడం గమనార్హం. మాంద్యం వచ్చినపుడల్లా అమెరికా నుంచి ఇక్కడి కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గడంతో పాటు కంపెనీలు తమ కొత్త పెట్టుబడులను వాయిదా వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టెక్‌ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్‌కు కూడా రానున్న రోజుల్లో ఐటీ రంగానికి సంబంధించిన పెట్టుబడులు తగ్గవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే గత కొన్నేళ్లుగా దూకుడు మీదున్న హైదరాబాద్‌ ఐటీ రంగం మందగమనంలోకి వెళ్లడంతో పాటు ఈ రంగం నుంచి వెల్లువలా వచ్చే ఉపాధి అవకాశాలు కూడా సన్నగిల్లుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement