హైదరాబాద్, ఆంధ్రప్రభ : యాసంగిలో పంట చేతికొచ్చే సమయానికి వద్దన్నా రెండు దఫాలుగా రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చిన వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే వానాకాలం సీజన్ నెలన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవకపోవడం గమనార్హం. ఎండాకాలం యాసంగిలో వద్దన్నా కురిసిన బారీ వర్షాలు అదే వానాకాలం వచ్చే ముఖం చాటేయడంతో ఆరుతడి పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాల రాక కోసం తెలంగాణ రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు లేక పత్తి, కంది, సోయా, మిర్చి, వేరుశనగ మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు రెండాకుల దశలోనే ఉన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక మొలకదశలోనే పత్తి ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు 50లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కాని వర్షాలు ముఖం చాయేటడంతో అడపదడపా వానలకు కొన్ని జిల్లాల్లో రైతులు విత్తనాలు వేశారు.
ఇప్పటికీ దాదాపు 20లక్షల ఎకరాల్లో వర్షాలు పడితే పత్తి నాటేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా ఏటా వర్షాకాలం ఆరంభంలో కురిసే వర్షాలతోనే రైతులు ఆతరుడి పంట విత్తనాలు వేస్తారు. వర్షాలు కురుస్తాయోమోనన్న ఆశతో ఈసారి కూడా రోహిణిలోనే పత్తి విత్తనాలు నాటారు. అయితే జూన్ నెలలో ఆరుతడి పంటలకు కావాల్సినంతగా వర్షాలు కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. చెదురుముదురు చినుకులకే విత్తనాలు విత్తినా అవి మొలకెత్తేందుకు, మొలకెత్తినా ప్రాణం పోసుకుని ఎ దిగేందుకు సరిపడా వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం జులై మొదటి వారం గడిచిపోయినా కూడా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వానాకాలం పంటలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గతేడాది ఇదే సమయానికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది. కాని ఈ ఏడాది జులై రెండో వారం వచ్చినా వరుణుడు కరుణించడం లేదు. సాధారణంగా జూన్ నెలతలో 144.1 మీమీ. వర్షపాతం కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్లో కేవలం 66.9 మి.మీ. వర్షపాతం అది కూడా మూడు, నాలుగు జిల్లాల్లోనే కురిసింది. దాదాపు 77.2 మి.మీ లోటు వర్షపాతం జులైలో నమోదయింది. వర్షాలు పడక పత్తి మొక్కలు ఎండిపోతుండడంతో రైతులు కూలీలను పెట్టి మరి బిందెలు, ట్యాంకర్లతో మొక్కమొక్కకూ నీటిని పోస్తున్నారు.
సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయని ఆవదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడం లేదు. దీంతో కనీసం బోరు, బావినీటితోనైనా ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏటా మాదిరిగా జూన్ నెలలో వర్షాలు కురిస్తే పత్తి మొక్కలు జులై రెండో వారంకల్లా మొక్క ఎదగడంతోపాటు కొమ్మలు పెట్టే దశలో ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తు పెరగాల్సి ఉంది. కాని ఈ సారి నెలన్నర వానాకాలం సీజన్ గడుస్తున్నా పత్తి మొక్కలు ఇంకా రెండాకుల దశలోనే ఉన్నాయి. మొక్క ఎదుగుదల ఆశించిన స్థాయిలో లేకపోతే కొమ్మలు రాకపోతే కాత తగ్గి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మరో రెండు వారాలు వర్షాలు కురవకపోతే ఆత ర్వాత కురిసినా పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు చెబుతున్నారు.