న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజిలో పిల్లర్లు మునిగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ అనేక లోపాలను గుర్తించింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతతో పాటు నిర్వహణపరమైన లోపాలే ఈ ఘటనకు కారణమని తేల్చి చెప్పింది. బ్యారేజి పునాదుల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం వల్ల పిల్లర్ల సపోర్ట్ బలహీనపడిందని, దీనికి తోడు ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత, సామర్థ్యం కూడా తక్కువగా ఉన్నాయని పేర్కొంది.
బ్యారేజి ప్రణాళిక (ప్లానింగ్), రూపకల్పన (డిజైన్) సరిగా లేవని వెల్లడించింది. బ్యారేజిని తేలియాడే స్థిరమైన కట్టడంగా నిర్మించారని ఆరోపించింది. మొత్తమ్మద ప్లానింగ్ ప్రకారం డిజైన్ లేదు, డిజైన్ ప్రకారం నిర్మాణం జరగలేదు అంటూ తన నివేదికలో వ్యాఖ్యానించింది. 2019లో బ్యారేజిని ప్రారంభించినప్పటి నుంచి డ్యామ్ నిర్వాహకులు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను, లాంచింగ్ ఆప్రాన్‌లను సరిగా పరిశీలించలేదని, అలాగే మెయింటెనెన్స్ కూడా చేపట్టలేదని విమర్శించింది.
డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజి క్రమంగా బలహీనపడిందని వెల్లడించింది. వర్షాకాలానికి ముందు, తర్వాత ఏదైనా అసాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణకు పలుమార్లు సూచించిందని గుర్తుచేసింది. కానీ ఈ సూచనలను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అమలు చేయలేదని స్పష్టమవుతోందని నివేదికలో పేర్కొంది.
బ్యారేజిలో ఒక బ్లాక్‌లో ఏర్పడ్డ సమస్య కారణంగా మొత్తం బ్యారేజిని ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది. సమస్య పరిష్కారం జరిగే వరకు ఉపయోగించడానికి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేసింది. మరోవైపు బ్లాక్ నెంబర్ 7 రిపేర్ చేయడానికి వీలుగా లేదని తెలియజేసింది. మొత్తం బ్లాక్‌ను పునాదుల నుంచి తొలగించి పునర్మించాల్సి ఉంటుందని వెల్లడించింది.
నిర్మాణ సారూప్యతను పరిగణలోకి తీసుకుంటే మేడిగడ్డ బ్యారేజిలోని ఇతర బ్లాక్‌లు కూడా ఇదే రీతిన వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజిని పునర్మించాల్సిన అవసరం వస్తుందని పేర్కొంది. బ్యారేజిని పునరుద్ధరించే వరకు.. రిజర్వాయర్‌లో నీటిని నింపకూడదని, నింపితే పైపింగ్ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని తెలియజేసింది.
గాంట్రీ క్రేన్ కూడా ఆపరేట్ చేయకూడదని వెల్లడించింది. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు కూడా డిజైన్, నిర్మాణ పద్ధతులు కలిగి ఉన్నాయని, అంటే ఇవి కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని సూత్రీకరించింది. యుద్ధ ప్రాతిపదికన ఈ రెండు బ్యారేజీలను కూడా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని కమిటీ నివేదికలో ప్రస్తావించింది.