– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇవ్వాల (మంగళవారం) ఆకస్మికంగా ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. అక్కడి జర్నలిస్టులను ఆఫీసు నుంచి బయటకు పంపించి, వారి ఫోన్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఢిల్లీలో జరుగుతన్న ఈ ఆకస్మిక పరిణామాలతో పలు మీడియా సంస్థలు ఆందోళనకు గురవుతున్నాయి. సెంట్రల్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కు సమీపంలో ఉన్న BBC స్టూడియో దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడా. ఈ సెంటర్లో అనేక జాతీయ, మల్టీనేషనల్ కంపెనీల ఆఫీసులు ఉన్నాయి. తొలుత ఢిల్లీలో జరిగిన విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో మీడియా వ్యక్తులు, ఫొటోగ్రాఫర్‌లు, లంచ్ బ్రేక్ కోసం వచ్చిన వారు చర్చించుకుంటూ కనిపించారు.
ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002 గుజరాత్ అల్లర్లపై BBC రెండు భాగాల సిరీస్ డాక్యుమెంటరీ ‘‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’’ను ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇలా ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ అల్లర్లలో వేలమంది హత్యకుగురయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని ఇది పెద్దఎత్తున ఆందోళనకు గురిచేసింది. లక్షలాది మందిని చంపి, చాలా మంది ముస్లింలు నిర్వాసితులైన ఈ అల్లర్లకు “మోడీయే ప్రత్యక్ష బాధ్యత” అని బీబీసీ డాక్యుమెంటరీలో వెల్లడించారు.
అయితే.. బీబీసీ ఢిల్లీ, ముంబై ఆఫీసులపై ఐటీ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్. ఇదంతా అదానీ సమస్య నుంచి తప్పించుకునేందుకు దారి మళ్లింపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఇక్కడ తాము అదానీపై JPC వేయాలని డిమాండ్ చేస్తున్నామని, కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం BBC పనిలో బిజీగా ఉందని సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యారు. వినాష్ కాలే విపరీత బుద్ధి అని జైరాం ట్విట్టర్లో తెలిపారు.
తెలంగాణ ఐటీ మంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ లీడర్ కేటీ రామారావు కూడా బీబీసీపై ఐటీ దాడి గురించి స్పందించారు. తమ తదుపరి కార్యాచరణ గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.”ఏమి ఆశ్చర్యం!! వారు మోడీపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత.. IT, CBI, ED వంటి ఏజెన్సీలతో దాడి జరుగుతోంది. BBC ఇండియా, BJP కీలుబొమ్మగా మారనందుకు ఈ దాడి చేస్తున్నారా? హిండెన్‌బర్గ్ నివేదికను పక్కదారి పట్టేంచేందుకు ED దాడులా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
మీడియాపై ప్రభుత్వం వేధింపులపై ఎడిటర్స్ గిల్డ్ స్పందన..
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బీబీసీ ఇండియా కార్యాలయాల్లో జరుగుతున్న IT దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది “పాలక వ్యవస్థను విమర్శించే వార్తా సంస్థలను భయపెట్టడానికి, వేధించడానికి ప్రభుత్వ ఏజెన్సీల నిరంతర ధోరణి” గా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాకుండా.. NewsClick, Newslaundry కార్యాలయాల్లో కూడా IT దాడులు జరిగాయని, 2021 జూన్‌లో దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్‌పై ఇట్లనే చేశారని ఎడిటర్ గిల్డ్ పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో న్యూస్‌క్లిక్ కార్యాలయంలో ED దాడులు నిర్వహించింది. ” వార్తా సంస్థలు ప్రభుత్వ విమర్శనాత్మక కవరేజీకి వ్యతిరేకంగా ఈ దాడులు జరుగుతున్నాయి” అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అటువంటి పరిశోధనలు నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్వహిస్తారని, స్వతంత్ర మీడియాను బెదిరించే వేధింపుల సాధనంగా ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు దిగజారకుండా ఉండాలని తెలిపారు. ప్రభుత్వాలు తప్పుదారిపడిదే మీడియా సంస్థలు నిక్కచ్చిగా నిజాలు రాస్తాయని గిల్డ్ పునరుద్ఘాటించింది.