సింగరేణి కాలరీస్‌లో ఇటీవల జరిగిన కార్మిక సంఘాల ఎన్నికల్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా ఎన్నికైన సింగరేణి కాలరీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ) లకు సోమవారం సింగరేణి భవన్‌లో గుర్తింపు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు మాట్లాడుతూ సింగరేణి అనేక రకాలుగా విస్తరిస్తున్నదని, ఈ నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ వర్క్ కల్చర్ కు గొప్ప ఆదర్శవంతమైన సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి ఎదుగుదలలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని, ఇకపై కూడా సంస్థ అభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి పునరంకితమవుతామన్నారు.
ప్రాతినిధ్య సంఘం సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. కంపెనీ విస్తరణకు, అభివృద్ధికి, కార్మికుల సంక్షేం కోసం తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. కంపెనీ అభివృద్ధిలో కార్మిక సంఘాల పాత్ర ఎంతో ఉందని , ఇదే సహకారాన్ని మున్ముందు కొనసాగించాలని కోరారు.
కార్యక్రమంలో జనరల్ మేనేజర్(కో ఆర్డినేషన్) శ్రీ ఎస్ డి.ఎం.సుభానీ, జీఎం(ఐఆర్, పీఎం) శ్రీమతి కవితానాయుడు, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ శ్రీ రాజ్ కుమార్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ శ్రీ త్యాగరాజన్, అన్ని ఏరియాల గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.