న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోని ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ వాత్సల్య’ పథకంపై 2022-23 సంవత్సరానికి ప్రణాళికలు, ఆర్థిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఇందుకు సంబంధించి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ వివరణాత్మక మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. పిల్లల సంక్షేమం, పునరావాసం కోసం గతంలో బాలల రక్షణ సేవల పథకం పేరుతో అమలైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2009-10 సంవత్సరం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకంగా మార్చి మిషన్ వాత్సల్య పేరుతో అమలు చేస్తోంది. పిల్లల్లో సామర్థ్యాలను గుర్తించి అన్ని రంగాల్లో వారు అభివృద్ధి సాధించేందుకు ఈ పథకం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. పిల్లలు సుస్థిరాభివృద్ధి సాధించేందుకు అవసరమైన పరిస్థితులు కల్పించడం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 నిబంధనలు పూర్తిగా అమలు జరిగేలా చూడడం, ఎస్డీజీ లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మిషన్ సహకారం అందిస్తుంది.
చట్టబద్ధమైన సంస్థల పనితీరును మెరుగు పరచడం, లోపాలు లేకుండా సేవలను అందించే వ్యవస్థను బలోపేతం చేయడం, ఉన్నత స్థాయి సంస్థాగత సంరక్షణ సేవలు, సంస్థలతో సంబంధం లేకుండా సమాజ భాగస్వామ్యంతో సంరక్షణ చర్యలను ప్రోత్సహించడం, అత్యవసర ఔట్రీచ్ సేవలు, శిక్షణ మరియు సామర్థ్యం పెంపుదల అంశాలతో ‘మిషన్ వాత్సల్య’ అమలవుతోంది. పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎంవోయూపై సంతకం చేశాయి. కేంద్ర ప్రాయోజిత పథకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్దేశిత వ్యయ భాగస్వామ్య నిష్పత్తి ప్రకారం ‘మిషన్ వాత్సల్య’ అమలవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.