బాకు(అజర్‌బైజాన్): ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మరోసారి సత్తా చాటుకున్నారు. పురుషుల 25 మీటర్స్ స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు స్వర్ణం అందించగా.. మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ పోటీల్లో టియాన, యషిత షోకీన్, కృతిక బృంధం కాంస్యం గెలుచుకున్నారు. దాంతోపాటు ఈ మెగా ఈవెంట్‌లో భారత్ మొత్తంగా 5 స్వర్ణాలు, 4 కాంస్యలతో మెడల్స్ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
చైనా 13 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు గెలుచుకొని అగ్ర స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు అమెరికా 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడో స్థానం దక్కించుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల వ్యక్తిగత విభాగం 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ పోటీల్లో అమన్‌ప్రీత్ సింగ్ (577) షూటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి భాతర్‌కు 5వ బంగారు పతకాన్ని అందించాడు. అమన్ కంటే మూడు పాయింట్లు తక్కువగా చేసిన కొరియా షూటర్ లీ గునియోక్ (574)తో రజతం సొంతం చేసుకున్నాడు.
ఫ్రాన్స్ తరఫున కెవిన్ చాపన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. కానీ పురుషుల 25 మీటర్స్ స్టాండర్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మాత్రం అమన్‌ప్రీత్ బృంధం 4వ స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. మరోవైపు మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో టియాన, యషిత షోకీన్, కృతిక బృంధం (1601) స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
వ్యక్తిగత విభాగంలో విఫలమైన వీరు టీమ్ ఈవెంట్‌లో మాత్రం సత్తా చాటారు. తొలి స్థానంలో నిలిచిన చైనా స్వర్ణం సాధించగా.. రెండో స్థానంలో దక్కించుకున్న ఆతిథ్య అజర్‌బైజాన్ జట్టు రజతం సొంతం చేసుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో మాత్రం భారత షూటర్లు విఫలమయ్యారు. టియాన (538)తో 11వ స్థానంలో నిలువగా.. యషిత షోకీన్ (536)తో 12వ స్థానం, కృతిక శర్మ (527)తో 14వ స్థానంతో సరిపెట్టుకున్నారు.