Thursday, October 17, 2024

ISRO | జనవరి 1న ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం.. కొత్త ఏడాదిలో సరికొత్త ప్రయత్నం

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమైంది. 2024 జనవరి 1న దేశ మొట్టమొదటి ఎక్స్‌-రే పొలారిమీటర్‌ శాటిలైట్‌ (ఎక్స్‌-పొశాట్‌) ని మోసుకెళ్లే పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ నింగిలోకి వెళ్లనుంది.భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి కానుంది. జనవరి 1న ఉదయం 9.10 గంటలకు ఎక్స్‌పో శాట్‌ బయల్దేరుతుందని ఇస్రో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్‌లో అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-కిరణాల ఆస్ట్రానమీ స్థాపించాం. ప్రధానంగా ఇమేజింగ్‌, టైమ్‌-డొమైన్‌ అధ్యనయం, స్పెక్టోస్కోపీపై ఇది దృష్టిసారిస్తుంది అని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్స్‌పొశాట్‌ మిషన్‌ తీవ్రమైన ఎక్స్‌-రే మూలాల ధ్రువణాన్ని పరిసోధించడానికి ఉద్దేశించింది. ఇది అంతరిక్ష-ఆధారిత ధ్రువణతలో భారతదేశాన్ని ముందంజలో నిలిపే శాస్త్రీయ ప్రయత్నం. ఈ మిషన్‌ 2021లో నాసా ప్రారంభించిన ఇమేజింగ్‌ ఎక్స్‌-రే పొలారి మెట్రీ ఎక్స్‌ప్లోరర్‌ (ఐఎక్స్‌పిఈ) తరహాది.

భారతదేశపు తొలి పొలారిమెట్రీ మిషన్‌. ప్రపంచంలో రెండవది. సవాళ్లతో కూడుకున్న పల్సర్‌లు, బ్లాక్‌హోల్‌ ఎక్స్‌-రే బైనరీలు, యాక్టివ్‌ గెలాక్సీ న్యూక్లియైలు, న్యూట్రాన్‌ నక్షత్రాలు, నాన్‌-థర్మల్‌ సూపర్‌నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఈ ఎక్స్‌పొశాట్‌ అధ్యయనం చేస్తుంది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కి.మీ వృత్తాకార తక్కువ భూ కక్ష్యలో ఉంచుతారు. దాదాపు ఆరు డిగ్రీల వంపు కలిగిన రెండు సైంటిఫిక్‌ పేలోడ్‌లను ఇది మోసుకెళ్తుంది.

- Advertisement -

ఈ మిషన్‌ జీవితకాలం ఐదేళ్లు. పొలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువులు, తోకచుక్కుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన సాధనం. ఎక్స్‌పొశాట్‌ మిషన్‌ తనలోని రెండు పేలోడ్‌ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్‌-కిరణాల మూలాల టెంపోరల్‌, స్పెక్ట్రల్‌, పోలరైజేషన్‌ లక్షణాలను ఏకకాలంలో అధ్యయనం చేయగలదు. ఇందులోని ప్రాథమిక పేలోడ్‌, పొలిక్స్‌ (ఎక్స్‌-కిరణాలతో పొలారి మీటర్‌ పరికరం) 8-30 కెఇవి ఫోటాన్‌ల మధ్యస్థ ఎక్స్‌-రే శక్తి పరిధిలో ధ్రువణస్థాయి, కోణాన్ని కొలుస్తుంది.

అలాగే ఎక్స్‌-రే స్పెక్టోస్కోపీ పేలోడ్‌ 0.8-15 కెఇవి శక్తి పరిధిలో స్పెక్టోస్కోపిక్‌ సమాచారాన్ని అందిస్తుంది. ఈ పేలోడ్‌లు గ్రహణ కాలంలో భూమిపై నీడ ప్రయాణించే సమయంలో ఎక్స్‌ కిరణాల మూలాలను అధ్యయనం చేస్తాయి. యుఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ సహకారంతో రామన్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ సాధనాలు ఖగోళ వస్తువుల కొత్త అంతర్‌దృష్టులను అందిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎక్స్‌-రే కిరణాల ధ్రువణాన్ని కొలవడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ సుదూర మూలాల జ్యామితి, ఉద్గార విధానాల గురించి క్లిష్టమైన సమాచారాన్ని అంచనా వేయడానికి వీలవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement