Friday, November 22, 2024

XPoSat | మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు ఇస్రో సిద్దం..

చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయాన్-3ను ల్యాండింగ్ చేసి సరికొత్త చరిత్రను సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఎక్స్-రేస్ అధ్యయనానికి మొదటిసారి పొలారిమెట్రీ మిషన్‌ను చేపడుతోంది. డిసెంబరు 28న ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. తీవ్రమైన ఎక్స్-రేస్ మూలాల ధ్రువణాన్ని పరిశోధించే లక్ష్యంతో భారత్ మొదటి ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహ (XPoSat) ప్రయోగానికి సిద్ధమైంది.

‘భారత్‌లో అంతరిక్ష-ఆధారిత ఎక్స్-రే ఆస్ట్రానమీ స్థాపించాం.. ప్రధానంగా ఇమేజింగ్, టైమ్-డొమైన్ అధ్యయనం, స్పెక్ట్రోస్కోపీపై ఇది దృష్టి సారిస్తుంది.. అంతే కాకుండా బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియైలు, పల్సర్ విండ్ నెబ్యుల వంటి వివిధ ఖగోళ మూలాల ఉద్గారాలను అర్థం చేసుకోవడానికి, కొలవడానికి సహాయపడుతుంది’ అని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

భూకక్ష్యకు సుమారు 650 కి.మీ ఎత్తులో ఉన్న సూర్యుడికి సంబంధం లేని సమకాలిక కక్ష్య నుంచి అధ్యయనం చేసేలా ఎక్స్‌పోశాట్ స్పేస్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు. దాదాపు ఆరు డిగ్రీల తక్కువ వంపు కలిగిన రెండు సైంటిఫిక్ పేలోడ్‌లను ఇది మోసుకెళ్లనుందని మిషన్ డాక్యుమెంట్‌లో ఇస్రో వివరించింది. POLIX పేలోడ్‌ను ఇస్రో మద్దతుతో బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (RRI) అభివృద్ధి చేయగా.. XSPECT పేలోడ్‌ను ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC) అభివృద్ధి చేసింది. కాగా, ఎక్స్-పోశాట్ అనేది భారత్ మొదటి, ప్రపంచంలో రెండో అంతరిక్ష మిషన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement