Tuesday, November 26, 2024

Big Story | ఇస్రో, వాట్ నెక్ట్స్.. చంద్రయాన్‌- 4కు రెఢీ

అమరావతి, ఆంధ్రప్రభ : చంద్రయాన్‌ 3ను విజయవంతంగా ప్రయోగించిన తరువాత చంద్రుడిపై సేఫ్‌ ల్యాండిగ్‌ అయ్యే అవకాశాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే, ఇస్రో శాస్త్రవేత్తలు మాత్రం చంద్రయాన్‌-3 చంద్రునిపై సేఫ్‌ ల్యాండ్‌ అవుతుందనే ఆశతో ఉంటూనే మరోవైపు చంద్రయాన్‌ -4కు సమాయత్తమయ్యేందుకు కార్యోన్ముఖులవుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రునిపై అనేక దఫాలుగా పలు పరిశోధనలు జరిపిన మీదట మనిషిని చంద్రునిపైకి పంపాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. గతంలో ప్రయోగించిన చంద్రయాన్‌ -1లో ఆర్బిటర్‌, మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌ను జాబిల్లి వద్దకు పంపించారు.

ఇక చంద్రయాన్‌ – 2లో ఆర్బిటర్‌తోపాటు ల్యాండర్‌, రోవర్ను కూడా చంద్రుడిపైకి ప్రయోగించారు. అయితే చంద్రయాన్‌ -2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం కావడంతో ల్యాండర్‌ సేఫ్‌ ల్యాండింగ్‌ కాకుండా క్రాష్‌ ల్యాండింగ్‌ అయింది. దీంతో ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటికి రాలేదు. ఇటు ఇస్రోకు కూడా ల్యాండర్‌, రోవర్‌ నుంచి ఎలాంటి సమాచారం అందకుండా కమ్యూనికేషన్‌ వ్యవస్థ కట్‌ అయిపోయింది. అయితే ప్రస్తుతం ప్రయోగించిన చంద్రయాన్‌ – 3లో ఆర్పిటర్‌ను పంపించలేదు. చంద్రయాన్‌ – 2లో ఉన్న ఆర్బిటర్‌ ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతుండటంతో దాని సేవలే వినియోగించుకోనున్నారు.

ఇక ల్యాండర్‌ జాబిల్లి మీద సాప్ట్‌ ల్యాండింగ్‌ అయ్యేందుకు.. గతంలో తలెత్తిన వైఫల్యాలను తొలగించారు. దీంతో ల్యాండర్‌ చంద్రుని మీద దిగి.. రోవర్‌ బయటికి వచ్చి అక్కడ పరిశోధనలు చేసి భూమి మీదకు పంపిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఈ సమాచారం ఇస్రోకు చేరితే తర్వాత చేపట్టే ప్రయోగాలకు ఎంతో కీలకం కానుంది. ఇది విజయవంతంగా పూర్తి చేస్తే చంద్రయాన్‌ – 4 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఇందులో మనుషులను పంపి.. చంద్రుడిపైన కాలు మోపనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

జాబిల్లి మీదకు మనిషి వెళ్లడమే ప్రధాన లక్ష్యంగా..

అసలు ఇస్రో ప్రధాన లక్ష్యం చంద్రుడిపైకి మనుషుల్ని పంపించడమే. అయితే అది అంత సులువు కాదు. కాబట్టి ఇంకా చాలా పరిశోధనలు పూర్తి కావాల్సి ఉంటు-ంది. ప్రస్తుతం ప్రయోగించిన చంద్రయాన్‌ – 3 విశ్లేషించి భూమికి పంపించే సమాచారం తర్వాతి పరిశోధనలు, ప్రయోగాలకు అత్యంత కీలకం కానుంది. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చంద్రయాన్‌ – 4 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఇలా వరుసగా చేస్తున్న ప్రయోగాలలో వచ్చిన విజయాలు, సమాచారాన్ని బట్టి జాబిల్లిపైకి మనుషులను పంపేందుకు ఇస్రో చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే మరిన్ని ప్రయోగాలను కూడా నిర్వహిస్తోంది. ఇక ఇస్రో చేపట్టబోయే గగన్యాన్‌ ప్రయోగం కూడా ఈ లక్ష్యంలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.

తొలి వ్యోమగామి రాకేష్‌ శర్మ

భారత్‌ తరఫున రోదసీలకి వెళ్లిన తొలి వ్యోమగామి రాకేశ్‌ శర్మ. అయితే రాకేశ్‌ శర్మ.. రష్యాకు చెందిన సోయజ్‌ వ్యోమ నౌకలో అంతరిక్ష యాత్రకు వెళ్లి.. విజయవంతంగా తిరిగి వచ్చారు. అయితే ఇలా వేరే దేశాలపై ఆధారపడకుండా.. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో వ్యోమగాములను రోదసీలోకి పంపేందుకు ఇస్రో ఇలా ప్రయోగాలను చేస్తోంది. ఇందులో భాగంగానే గగన్యాన్‌ ప్రయోగాన్ని త్వరలోనే చేపట్టబోతోంది. ఈ గగన్యాన్‌ ప్రయోగంలో ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లనున్నారు. అక్కడ మూడు రోజుల పాటు ఉంచిన అనంతరం వారిని తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు.

అయితే ఇప్పటివరకు చేసిన ప్రయోగాలకు మనుషులను రోదసీలోకి పంపించేందుకు చాలా తేడాలు ఉన్నాయి. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ సిరీస్‌లోని చంద్రయాన్‌ – 1, చంద్రయాన్‌ – 2 ప్రయోగాల్లో పంపించిన పరికరాలేవీ భూమి మీదకు తిరిగి రాలేదు. ఇక ప్రస్తుతం నింగిలోకి వెళ్లిన చంద్రయాన్‌ – 3లోని ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్లు ఏవీ తిరిగి వెనక్కి రావు.. వాటిని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనుషులను పంపించినపుడు మాత్రం.. వారిని ఎంత సురక్షితంగా అయితే నింగిలోకి తీసుకువెళ్తున్నామో అంతే విజయవంతంగా తిరిగి భూమి మీదకు తీసుకురావాల్సి ఉంటు-ంది. దాని కోసం క్రూ మాడ్యూళ్లను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంటు-ంది.

అమెరికాకు ధీటుగా..

ఇప్పటికే నాసా ఎన్నోసార్లు నింగిలోకి మనుషుల్ని పంపించింది. చంద్రుడిపైకి కూడా వ్యోమగాముల్ని దించి.. సురక్షితంగా భూమికి రప్పించింది. అయితే అమెరికా అధిక బడ్జెట్‌తో అత్యంత శక్తివంతమైన వాహక నౌకలు, భారీ రాకెట్లను, భారీగా ఇంధనాన్ని సమకూర్చుతుంది. అందుకే నాసా ప్రయోగించే రాకెట్లు- చంద్రుడిని చేరడానికి కేవలం 4 రోజులే పడుతుండగా.. ఇస్రో ప్రయోగించే రాకెట్లకు మాత్రం 40 రోజులకుపైగా పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇస్రోకు భారీ రాకెట్లు అవసరం అవుతాయి. చంద్రుడిపైకి వెళ్లే మానవ సహిత ల్యాండర్లను తిరిగి భూమికి తీసుకురావాలంటే.. చంద్రుడికి కొంత ఎత్తులో కమాండ్‌ మాడ్యూల్ను ఏర్పాటు చేయాలి. ఈ కమాండ్‌ మాడ్యూల్‌ నుంచి.. ల్యాండర్‌ జాబిల్లి మీద దిగుతుంది.

అనంతరం వ్యోమగాములు పరిశోధనలు చేసి.. అదే ల్యాండర్‌ మాడ్యూల్లో చంద్రుడి ఉపరితలంపై ఉన్న కమాండ్‌ మాడ్యూల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కమాండ్‌ మాడ్యూల్‌ను భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలి. అయితే ఈ ప్రయోగాలు మొత్తం కేవలం 10 రోజుల్లోపే పూర్తి చేయాలి. దానికి ప్రస్తుతం ఇస్రో వద్ద ఉన్న సాంకేతికత గానీ, రాకెట్లు గానీ సరిపోవు. ఇంకా అత్యధునిక టెక్నాలజీ, హెవీ రాకెట్లను ఇస్రో సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. చంద్రుడి మీద వాతావరణం ఉండదు దీనికి తోడు అంతరిక్షంలో ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో రాకెట్లు ప్రయాణించేలా క్రయోజనిక్‌ ఇంజిన్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వ్యోమగాములను సురక్షితంగా ల్యాండ్‌ చేసేలా…..

వీటితో పాటు ప్రయోగ సమయంలో ఎప్పుడైనా లోపం తలెత్తి ప్రమాదం జరిగితే అందులో వెళ్లిన వ్యోమగాములను రక్షించడం అతి మఖ్యం. అందుకోసం క్రూ మాడ్యుళ్లను రక్షించేందుకు క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ కూడా తయారు చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా వ్యోమగాముల్ని భూమి మీదకు తీసుకొచ్చే క్రూ మాడ్యూల్‌ కావాలి. వీటితో పాటు టెస్ట్‌ వెహికల్‌ మిషన్‌ తయారు చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగినపుడు వ్యోమగాముల్ని ప్రయోగం నుంచి పక్కకు తప్పించేలా పాడ్‌ అబార్ట్‌ టెస్టులు చేపట్టాలి.

అందు కోసం ముందుగా జాబిల్లి మీదికి వ్యోమగాముల్ని పంపడానికి ముందు మానవ రహితంగా ప్రయోగాలు చేయాలి. అవి విజయవంతం అయిన తర్వాత అందులో వ్యోమగాములను పంపించాలి. ఇవన్నీ సాధించాలంటే.. ప్రస్తుతం ప్రయోగించిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమై చంద్రుడిపైన పరిశోధనలు జరిపి, అక్కడి స్థితిగతులను భూమ్మీదకు పంపించాలి. వాటి ఆధారంగా ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేస్తుంది.

చంద్రయాన్‌ 3 అతి ముఖ్యమైనది

చంద్రయాన్‌ సిరీస్‌లో చంద్రయాన్‌ – 3 అతి ముఖ్యమైందిగా ఇస్రో శాస్త్రవేత్తలు. నిపుణులు భావిస్తున్నారు. దీని విజయంపైనే.. జాబిల్లి మీదకు మానువుడు అడుగు పెట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. చంద్రయాన్‌ – 3 విజయవంతం అయితే ఆతర్వాత మరిన్ని ప్రయోగాలు చేస్తే చంద్రయాన్‌ 10 లేదా చంద్రయాన్‌ 11 ప్రయోగాల్లో మానవులను ఇస్రో చంద్రుడి మీదికి పంపించనున్నారు. వ్యోమగాములను జాబిల్లి వద్దకు పంపించి.. తిరిగి తీసుకురావాలంటే ముఖ్యంగా భారీ రాకెట్లు అవసరమవుతాయి.

దానికి ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. ప్రస్తుతం చంద్రుడి మీదికి పరికరాలు పంపిస్తున్నాం కాబట్టి.. కొంత ఆలస్యం అయినా జరిగే నష్టమేమీ లేదు. కానీ చంద్రుడి మీదికి వెళ్లి పరిశోధనలు జరిపి తిరిగి వ్యోమగాములు భూమిని చేరాలంటే ప్రతీ సెకన్‌ కూడా చాలా విలువైనదే. అందుకే ఇస్రోకు భారీ రాకెట్లు- కావాలి. ఆమేరకు వాటిని సమకూర్చుకునే పనిలో ఇప్పటి నుండే నిమగ్నమవుతోంది ఇస్రో..

Advertisement

తాజా వార్తలు

Advertisement