ఇజ్రాయిల్‌తో పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విమరణ ఒప్పందం అమలులోకి వచ్చింది. గత 11 రోజుల నుంచి భీకర దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల్లో తాత్కాలిక శాంతి నెలకొన్నది. దీంతో రాకెట్లు, మోర్టార్ల దాడులు ఆగిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా ఆ ప్రాంతంలో పురోగతికి నిజమైన అవకాశం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇజ్రాయిల్, హమాస్ దాడుల్లో సుమారు 240 మంది మరణించారు. గాజా నగరంలోనే ఎక్కువ మరణాలు నమోదు అయ్యాయి. హమాస్‌తో సంధి కుదిరిన వెంటనే పాలస్తీనియన్లు గాజా వీధుల్లో చేరి సంబరాలు జరుపుకున్నారు.
అయితే తాజాగా జరిగిన హింసాత్మక యుద్ధంలో తామే విజయం సాధించామని ఇజ్రాయిల్, హమాస్‌లు ప్రకటించుకున్నాయి. గురువారం రోజున ఇజ్రాయిల్ రక్షణ దళాలు సుమారు వంద కన్నా ఎక్కువ సార్లు గాజాలోని హమాస్ కేంద్రాలపై వైమానిక దాడులు చేశాయి. దానికి ప్రతీకారంగా హమాస్ కూడా రాకెట్లతో దాడి చేసింది.మే 10వ తేదీన జెరుసలామ్లోని అల్ మక్సా మసీదు వద్ద జరిగిన సంఘటనతో గాజాలో ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య భీకర పోరు సాగింది. యూదులు, అరబ్బు ముస్లింలు వీధుల్లోనూ కొట్టుకున్నారు. అల్ అక్సా మసీదు వద్ద ఇజ్రాయిల్ దళాలు ముస్లింలను చెదరగొట్టడంతో.. హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. దాడి, ప్రతిదాడుల్లో మొత్తం 232 మంది మరణించారు. దాంట్లో 100 మందికిపైగా మహిళలు,చిన్నారులు ఉన్నారు. గాజాలో 150 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. కానీ హమాస్ మాత్రం దీన్ని ద్రువీకరించలేదు. ఇజ్రాయిల్‌లో 12 మంది మరణించారు. గాజాలోని ఉగ్రవాదులు తమపై నాలుగు వేల రాకెట్లను వదిలినట్లు ఇజ్రాయిల్ చెప్పింది.