గాజా లో హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఉత్తర గాజాలో భూతల పోరాటం ఉద్ధృతమైంది. దక్షిణ గాజాలో బాంబుల మోత మోగుతోంది. దీంతో ఖైదీల విడుదల కోసం తాము చేసిన డిమాండ్లు నెరవేరకపోతే ఇజ్రాయెల్‌కు చెందిన బందీలు సజీవంగా గాజా నుంచి బయటపడలేరని హమాస్ హెచ్చరించింది..అయితే . ఈ హెచ్చరికలను ఖాతరు చేయకుండా సోమవారం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.
‘మా ఖైదీల విడుదల, చర్చలు లేకుండా ఇజ్రాయెల్ బందీలు సజీవంగా తమ స్వదేశానికి వెళ్లలేరు’ అని ఆదివారం హమాస్ బెదిరించింది. గాజాలో హమాస్ చెరలో 137 మంది బందీలు ఉండగా.. 7 వేల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రదాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్లు వెంటనే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. హమాస్ ముగింపు దగ్గరపడిందని ఆయన అన్నారు. అలాగే యుద్దం ఆపాలంటూ ఐక్య రాజ్య సమితి చేసిన వినతిని సైతం ఇజ్రాయేల్ తొసిపుచ్చి గాజాలో యుద్దాన్ని కొనసాగిస్తున్నది..