వాషింగ్టన్ : సిరియాలో అమెరికా సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో ఐఎస్‌ఐఎస్ కీలక నేత అబూ ఇబ్రహీం అల్-హషిమి అల్-ఖురేషీ హతం అయ్యాడు. వాయువ్య సిరియాలో చేపట్టిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక ఆపరేషన్‌ను సైనిక దళాలు విజయవంతంగా పూర్తి చేసినట్టు అమెరికా నిఘా వర్గాల అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని అగ్ర దేశ అధినేత జో బైడెన్ స్వయంగా ప్రకటించారు. పక్కా ప్లాన్ ప్రకారం.. అమెరికా దళాలు అబూ ఇబ్రహీంను తుదముట్టించాయి. టర్కీ సరిహద్దులో సిరియా పట్టణం అత్మెహ్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో అబూ ఇబ్రహీం తన కుటుంబంతో ఉంటున్నాడని సమాచారం అందింది. ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించిన అమెరికా సైన్యం.. దీని కోసం మాక్ డ్రిల్స్ కూడా చేశాయి. హెలికాప్టర్‌లు ఆ భవనంపై పలుమార్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని బయటికి వచ్చి గమనించిన ఇబ్రహీం.. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నిమిషాల వ్యవధిలోనే ఆ ఇంటిని హెలికాప్టర్లు రౌండప్ చేయడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సాహాయుడు అయ్యాడు.
ఉగ్రవాద నిరోధక ఆపరేషన్..
యూఎస్ మిలటరీ సిబ్బంది ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపట్టే ముందు.. చుట్టుపక్క వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలని లౌడ్ స్పీకర్స్ సాయంతో హెచ్చరించారు. అసలేం జరుగుతుందో తెలిసేలోపు అటు అమెరికా భద్రతా దళాలు, ఇటు ఇబ్రహీం నుంచి కాల్పలు ప్రారంభం అయ్యాయి. ఐఎస్‌ఐఎస్ చీఫ్ తమ పక్కనే నివాసం ఉంటున్న విషయం తెలిశాక స్థానికులు షాక్‌కు గురయ్యారు. అమెరికా సైన్యం భవనంపైకి దిగింది. ఇబ్రహీంను పట్టుకునే ముందే తనను తాను పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో అల్ ఖురేషీ సహా భవనంలోని ఉన్నవారంతా చనిపోయారు. పేలుడు ధాటికి శరీర భాగాలు తునాతునకలై భవనం నుంచి వీధుల్లోకి వచ్చాయి. సైన్యం ముందు ఇబ్రహీంను హెచ్చరించినట్టు స్థానికుడు తెలిపాడు.
మూడంతస్తుల భవనం నేలమట్టం..
పేలుడుకు ముందు మొదటి అంతస్తులో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు కనిపించినట్టు అమెరికా సైన్యం తెలిపింది. ఊహించినదానికంటే భారీ తీవ్రతతో పేలుడు సంభవించడంతో మూడో అంతస్తులోని ప్రతీ ఒక్కరు చనిపోయారు. ఖురేషీ, అతని భార్య, ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. రెండో అంతస్తుకు చేరుకునే సమయానికే ఖురేషీ తన భార్యను చంపేశాడు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. నలుగురు పిల్లలను కాపాడారు. కనీసం 13 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై జో బైడెన్ సైన్యానికి అభినందనలు తెలిపాడు. 2019 అక్టోబర్‌లో అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,