ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తుది జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటుదక్కింది. గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో యువ వికెట్‌కీపర్‌కు అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం నిర్ణయించింది. జూన్ 7-11 వరకు ఓవల్ వేదికపై జరిగే టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఐపీఎల్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే.
డబ్ల్యుటీసీ ఫైనల్ సమయానికి కోలుకునే అవకాశం లేనందున, అతని స్థానంలో ప్రత్యామ్నాయ ఎంపిక అనివార్యమైందని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. పేసర్ ఉనద్కట్ సైతం గాయంతో సతమతం అవుతుండగా, తుది జట్టుకు అతడిని ఎంపిక చేయడం గురించి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. మరో పేసర్ ఉమేష్ యాదవ్ సైతం ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడిని కేకేఆర్ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నది. ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ స్టాండ్‌బై ప్లేయర్లుగా ఉన్నారు.