తాడిపత్రి, (అనంతపురం) ప్రభ న్యూస్ : రైతన్న సంక్షేమమే ధ్యేయం.. అన్నదాతకు అండగా ఉంటాం.. సాగు సాయంగా, అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఆదుకునేందుకు ఖరీఫ్ ఆరంభంలోనే జగనన్న రైతు భరోసా అందిస్తున్నామని పాలకులు పలికిన ప్రగల్భాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. అనానుకూల వాతావరణం.. దళారుల దోపిడీల మధ్య ఉదారంగా ఉండాల్సిన ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య కుదించడమే ధ్యేయంగా.. నిబంధనల సాకు చూపుతూ కొర్రీలు వేస్తూ పలువురు రైతులకు భరోసా అందకుండా మొండి చెయ్యి చూపుతోంది. ఇటీవల విడుదల చేసిన జాబితాలో అనంతపురం జిల్లాలో 8000 మంది లబ్ధిదారులను అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. కష్టకాలంలో ఎంతో కొంత సహాయంగా ఉంటుందని ఆశించిన అన్నదాతలకు భరోసా అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. అమ్మ ఒడి.. చేయూత.. ఆసరా.. సామాజిక పింఛన్ల లబ్ధిదారులను నిబంధనల సాగుతో కుదించినట్లుగానే జగనన్న రైతు భరోసా ఆపరేషన్ను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ క్రమంలో నిబంధనల ముసుగులో కుంటి సాకులు చెబుతూ వీలైనంత వరకు భారం తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 8000 మంది రైతులు పథకానికి దూరం అయ్యారని సమాచారం. ప్రతి మండలంలో గత ఏడాది కన్నా లబ్ధిదారుల సంఖ్య తగ్గడమే ఇందుకు నిదర్శనం. ఒకే రేషన్ కార్డు లో పథకానికి అర్హులైన రెండు పేర్లు ఉన్నా.. వెబ్ లాండ్లో భూమి వివరాలు సరిగా లేవని, బ్యాంకు ఖాతా లింక్ తదితరాల సాకు చూపుతూ వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అనర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి మెలికలతో జిల్లాలో దాదాపు 8000 రైతులను రైతు భరోసా పథకానికి ప్రభుత్వం తేల్చి వారి ఖాతాలో నగదు జమ చేయలేదు. తొలి ఏడాది చాలా మంది రైతులకు అర్హులకు వర్తించలేదు. రైతుల నుంచి వ్యవసాయ అధికారులు వినతులు స్వీకరించి 36, 076 మందిని అనర్హులుగా సాయం అందించారు. 2021లో 5,57,494 మందికి రూ. 741.73 కోట్లు మంజూరు చేశారు. మూడో ఏడాది మళ్లీ కోత విధించారు. 19, 474 మంది రైతు పేర్లను వివిధ కారణాలతో జాబితా నుంచి తొలగించారు. రూ. 36.36 కోట్లు ప్రభుత్వానికి మిగిలింది. 2022 లో 5,39, 784 కుటుంబాలకు రూ.7, 500 చొప్పున రూ. 404. 83 కోట్లు మంజూరు చేశారు. 2021 తో పోలిస్తే 20 22 ఏడాదికి దాదాపు 8000మంది రైతులు తగ్గిపోయారు.
సమస్యకు దొరకని పరిష్కారం..
రైతు భరోసా పథకంలో చూపిన అనర్హతకు సంబంధించి సవరణల సమస్యకు పరిష్కారం దొరక్క రైతులు అల్లాడుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా రైతులకు శాపమైంది. నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది రైతులు బ్యాంకు ఖాతాను లింకు చేసుకోలేదు. ఇందువల్ల పథకానికి పూర్తిగా దూరం దూరమవ్వడమో, డబ్బులు జమ అవడంలో ఎడతెగని జాప్యమో జరుగుతోంది. దీనిపై మండల స్థాయిలో అవగాహన కల్పించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో పథకం ద్వారా అనేక మంది రైతులు లబ్దిపొంద లేక నష్టపోతున్నారు. ప్రకృతి విపత్తులకు తోడు ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా తోడై అన్నదాత చితికిపోతున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..