న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఒక ముక్కేసి మూలన కూర్చోమంటే కూర్చోవడానికి తానేమీ పెంపుడు జంతువును కాదని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జి బూర నర్సయ్య గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన, శనివారం టీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009 నుంచి తన వైద్య వృత్తిని కూడా పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న తీరు, కేసీఆర్‌తో కలిసి నడిచిన విధానం, టీఆర్‌ఎస్ పార్టీ నేతగా, ఎంపీగా తన పని తీరును గుర్తు చేస్తూ అధినేత కేసీఆర్‌కు వివరంగా లేఖ రాశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపిన అనంతరం బూర నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి కోసమే ఉద్యమం చేశానే తప్ప పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే పదవిని పొందానని చెప్పారు. ప్రజా సమస్యలను అధినేతకు చెప్పి పరిష్కారం కోసం పని చేయడమే రాజకీయ నాయకుడి లక్ష్యమన్న ఆయన, కానీ అధినేతను కలవడానికే తెలంగాణ ఉద్యమాన్ని మించి కష్టపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ అంటే బూతు పదంలా చూస్తే ఎలా? మునుగోడు అభ్యర్థిగా బీసీని పరిశీలించమని చెబితే ఇంతగా అవమానిస్తారా? ఏ మీటింగుకూ పిలవరా? అని బూర నర్సయ్య ప్రశ్నించారు. బీసీలకు టికెట్ అడిగితే తప్పా అని నిలదీశారు. కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరుతూ రాసి పంపే చిట్టీలలో “నేను ఏ పదవినీ కోరడం లేదు” అని స్పష్టంగా ప్రస్తావించే వాడినని వాపోయారు.
అయినా సరే కేసీఆర్ కలవడానికి ఒప్పుకోలేదని నర్సయ్య అన్నారు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఎంతో మంది సమర్ధించారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారని తెలిపారు. పేర్లు చెప్పను కానీ, చాలా మంది నేతలు తనతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ తనను బుజ్జగించాల్సిన అవసరం లేదన్న ఆయన, బుజ్జగింపులు కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. తనను అన్ని పార్టీల వారు సంప్రదిస్తున్నారని, నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని నర్సయ్య గౌడ్ వివరించారు.
అయితే ఇప్పటికే ఆయన పలువురు బీజేపీ పెద్దలతో భేటీలు, మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. బూర నర్సయ్య ఇంతవరకు తనను కలవలేదని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. రాజీనామా తర్వాత కూడా కేసీఆర్ నుంచి పిలుపు రాకపోతే బీజేపీలో చేరికపై ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.