న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: యావత్ తెలంగాణ రాష్ట్రం వర్షాలు, వరదలతో సతమతమవుతుంటే వారి బాగోగులు చూసుకోకుండా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మహారాష్ట్ర వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహం ఎదుట సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరికొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం వరదల్లో 40 మంది చనిపోయారని, 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. వరదల వల్ల మొత్తం రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, ఇలాంటప్పుడు ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీ వచ్చి ప్రధాని, హోంమంత్రిని కలిసి నిధులు కోరాలని అన్నారు.
కానీ సీఎం కేసీఆర్ తీరు చూస్తే.. ప్రజలను గాలికి వదిలేసి, మహారాష్ట్ర వెళ్లి రాజకీయాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మానవత్వం ఉన్న ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ కు ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. వదలు, వైపరీత్యాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని, పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి వెంటనే ఢిల్లీకి వచ్చి వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని అన్నారు. కేంద్రం తెలంగాణను ఆదుకోకపోతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
రుణ మాఫీతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
వర్షాలు, వరదలు, వైపరీత్యాల కారణంగా నష్టపోయినవారిలో కౌలు రైతులే ఎక్కువ అని, వారిలో బడుగు, బలహీన వర్గాలే అధికమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అలాంటి రైతులను ఆదుకునేంత మానవత్వం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. త్వరలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు. మరో మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, పంట నష్టపోయిన ప్రతి రైతునూ తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేయలేదని, తమ ప్రభుత్వం రుణమాఫీతో పాటు అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతులు ధైర్యంగా ఉండాలని అన్నారు. కౌలు రైతులను కూడా కాంగ్రెస్ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఇంత నష్టం జరిగితే కేసీఆర్ ఢిల్లీ ఎందుకు రావడం లేదో చెప్పాలని కోమటిరెడ్డి నిలదీశారు. ఆర్టీసీ విలీనం గురించి ప్రశ్నించగా.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసమే విలీనం చేశారని చెప్పారు. ప్రజలు తెలంగాణ ఇచ్చిన పార్టీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.