నిఖిల్ సినిమా “కార్తికేయ-2” కి కష్టాలు కొనసాగుతున్నాయి. చాలాసార్లు ఈ సినిమాని వాయిదా వేసుకోవాల్సివచ్చింది. మరో సినిమాతో థియేటర్ల కోసం పోటీ రాకుండా ఉండడానికి విడుదల తేదీ మార్చుకొన్నారు. ఎట్టకేలకు ఈనెల 13న ఈ సినిమా వస్తోంది. ఇప్పటికీ.. థియేటర్ల సమస్య కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఈ వారం సీతారామం, బింబిసార వచ్చాయి. రెండూ బాగానే ఆడుతున్నాయి. రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. వచ్చే వారం కూడా ఈ సినిమాలు రన్నింగ్‌లో ఉంటాయి. తమ థియేటర్లని వదులుకోవడానికి ఈ రెండు సినిమాలూ ఇష్టపడవు. పైగా 12న మాచర్ల నియోజకవర్గం వస్తోంది. రిలీజ్ డేట్‌ని ఎప్పడో లాక్ చేసుకొన్న సినిమా ఇది. థియేటర్లకు కూడా బ్లాక్ అయిపోయాయి. సో.. ఉన్న థియేటర్లని మాచర్ల నియోజక వర్గం లాగేసుకుంటుంది.
మరోవైపు నుంచి లాల్ సింగ్ చద్దా ఉండనే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాని భారీగానే విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లను టార్గెట్ చేసే సినిమా ఇది. ఇవన్నీ పంచుకోగా మిగిలిన థియేటర్లతో కార్తికేయ 2 సర్దుకోవాల్సివస్తోంది. కార్తికేయ 2పై భారీగా ఖర్చు పెట్టారు. అదంతా రావాలంటే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమైతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అయితే.. విజువల్ ఫీస్ట్ గా, థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. ఆ ట్రైలరే జనాల్ని థియేటర్లకు రప్పించాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.