న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్లో నిజమేంటో నేడు తేలిపోనుంది. ఈ ఎన్‌కౌంటర్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక బహిర్గతం కానుంది. కమిషన్ నివేదికను సుప్రీంకోర్టు ధర్మాసనం తెరవనుంది. తద్వారా ఎన్‌కౌంటర్ నిజంగా జరిగిందా లేక పోలీసులు కట్టు కథ అల్లారా అన్నది స్పష్టమవుతుంది. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సహా పలువురు పోలీసు అధికారుల భవితవ్యం ఆధారపడి ఉంది.
ఈ ఏడాది జనవరిలోనే సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదికను అందజేసింది. 2019 నవంబర్ 28న హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్ చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయితే ఈ దారుణ ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తమకు అప్పగించాలంటూ మహిళా సంఘాలు, ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులపై ఒత్తిడి తీవ్రతరమైంది.
సరిగ్గా ఇదే సమయంలో నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు చటాన్‌పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారని, ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారని అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. అయితే ప్రజాగ్రహాన్ని చల్లార్చడం పోలీసులే నిందితులను హతమార్చి ఎన్‌కౌంటర్ కథ అల్లారని హక్కుల సంఘాలు ఆరోపించారు. వాటిలో కొన్ని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి విచారణకు డిమాండ్ చేశాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్ప్కూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. హైద్రాబాద్ కేంద్రంగా విచారణ జరిపిన సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు అందించింది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..