అమెరికాలో వరసగా బ్యాంక్‌లు సంక్షోభంలో పడుతున్నాయి. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ మూతపడ్డాయి. చాలా కాలంగా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న యూరోపియన్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ కూడా పతనం అంచుల్లోఉంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిండం, యూబీ గ్రూప్ టేకోవర్ చేసుకునేందుకు ముందుకు రావడంతో మూతపడకుండా ఆగిపోయింది. ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం భారత్‌తో సహా అమెరికా, యూరోపియన్ దేశాలు వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్నాయి. ఇది బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఈ రంగంలో నిపుణుల దీనిపై పలు మార్లు హెచ్చరించారు. వడ్డీరేట్లు పెంచడం పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో మూతపడిన రెండు బ్యాంక్‌లతో పాటు సిల్వర్ గేట్ బ్యాంక్, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లు ఆర్ధిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఈ బ్యాంక్‌లు కూడా ఏ క్షణమైనా కుప్పకూలుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఆర్ధిక మాంద్యం తప్పదని భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం మార్కెట్లను వణికిస్తున్నాయి. ఆర్ధిక నిపుణులు కూడా ఈ పరిస్థితిని నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు వేగంగా సమర్ధవంతంగా నిర్ణయాలు తీసుకోవాని కోరుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని ఎంత భరోసా ఇచ్చినప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికాలో పతనం అంచులో ఉన్న ఫస్ట్ రిప్లబిక్ బ్యాంక్‌ను రక్షించేందుకు 11 బ్యాంక్‌లు ఏకమై 30 బిలియన్ డాలర్లు సమకూర్చాయి.
ఇది బ్యాంక్‌ను రక్షిస్తుందా లేదా అనేది అనుమానమే. వడ్డీ రేట్ల పెంపుతో అమెరికా బ్యాంకింగ్ రంగం కుదేలవుతోంది. ఈ ఒక్క నెలలోనే ఇప్పటి వరకు అమెరికా బ్యాంక్‌లు 229 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాయి. ఇది ఆగుతుందన్న నమ్మకంలేదు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే మార్కెట్లు మరింత ఒడుదొడుకులకులోను అవుతాయని స్టాక్ మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2022లో అమెరికా బ్యాంకుల మొత్తం నష్టాలు 620 బిలియన్ డాలర్లకు వరకు ఉన్నట్లు అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎఫ్‌డీఐసీ) ఛైర్మన్ మార్టిన్ గ్రెయెన్‌బెర్గ్ బ్యాంకింగ్ రంగానికి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు.
ఆర్ధిక సంక్షోభం తరుమకు వచ్చేందుకు 2008 లాగా పద్దగా కారణాలు కూడా అవసరంలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమయంలో లేమన్ బ్రదర్స్ మొత్తం ఆస్తులు 613 బిలియన్ డాలర్లుగా ఉంటే, అప్పులు 639 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తేడా 26 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్పటికీ సంక్షోభం వేగంగా వ్యాపించింది. ఇప్పుడు అమెరికాలోనూ చాలా బ్యాంక్‌ల ఆస్తులు, అప్పుల మధ్య తేడా తగ్గిపోతున్నది. అందుకే ఎఫ్‌డీఐసీ తాజాగా బ్యాంక్‌లను ఈ విషయంలోనే హెచ్చరికలు చేసింది. మన దేశంలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంక్‌లకు ఇదే అంశంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆస్తులు, అప్పులు (రుణాలు) మద్య తగిన సమతుల్యం ఉండాలని ఆర్బీఐ గట్టిగానే సూచించింది.
సంక్షోభం వైపుగా…
అమెరికాలో 2007-09 సంవత్సరాల్లో విపరీతంగా రుణాలు ఇచ్చాయి. ఇదే ప్రధానంగా ఆర్ధిక సంక్షోభానికి దారితీసింది. ఆ తరువాత రుణాల విషయంలో కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకు వచ్చారు. తమ వద్ద ఉన్న డిపాజిట్ డబ్బును ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టేలా ఖాతాదారులను బ్యాంక్‌లు ప్రోత్సహించాయి. దీని వల్ల బాండ్ మార్కెట్ బ్యాంక్‌లకు ఆధారంగా మారింది. చాలా కాలం పాటు ద్రవ్యోల్బణం లేకపోవడం, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నందున దీర్ఘకాలిక బాండ్లను పెద్దగా పట్టించుకోలేదు. కోవిడ్ సమయంలో అమెరికా ఫెడరల్ బ్యాంక్ బ్యాంకింగ్ వ్యవస్థలోని భారీగా నగదు సమకూర్చింది.
దీని వల్ల బ్యాంక్‌ల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు సమకూరింది. ఈ సొమ్ముతో బ్యాంక్‌లు దీర్ఘకాలిక బాండ్లు, ప్రభుత్వ హామీ ఉన్న మార్టిగేజ్ సెక్యూరిటీలను కొనుగోలు చేశాయి. బాండ్లలో వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి. ఈ బాండ్లను మెచురిటీ వరకు ఉంచుకోవాలంటే పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రకారం ఖాతాదారులకు కూడా అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో పెద్ద బ్యాంక్‌ల పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ, చిన్న బ్యాంక్‌లపై ఒత్తిడి పెరిగింది. వడ్డీల భారంతో లాభాల్లో కోత పడింది. ఫలితంగా ఇలాంటి బ్యాంక్‌లు ఆర్ధిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి.
వడ్డీరేట్ల భారం…
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో పరిస్థితి మరింతగా దిగజారింది. గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు ఫెడరల్ బ్యాంక్ వరసగా భారీ స్థాయిలో వడ్డీరేట్లు పెంచుతూ వస్తోంది. సంవత్సర కాలంలోనే ఇలా ఫెడ్ వడ్డీరేట్లను 4.5 శాతం పెంచింది. బాండ్లపై వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం వల్ల వాటి విలువ గణనీయంగా పడిపోయింది. ఫలితంగా బ్యాంక్ వద్ద భారీగా ఉన్న బాండ్ల విలవ తగ్గింది. అదే సమయంలో ఖాతాదారులకు పెంచిన వడ్డీ రేట్లు చెల్లించాల్సిన పరిస్థితి. ఫలితంగా ఫెడ్ పెంచుతున్న వడ్డీరేట్ల భారం బ్యాంక్‌ల బ్యాలెన్స్ షిట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. దీని వల్ల క్రమంగా బ్యాంక్‌లు ఆర్ధిక సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కూడా ఇలానే తన వద్ద ఉన్న బాండ్లను విక్రయించడం వల్ల 1.5 బిలియన్ డాలర్లు నష్టపోయింది.
ఫలితంగా బ్యాంక్ ఒక్కసారిగా పతనమైంది. ఈ బ్యాంక్ వద్ద మొత్తం సెక్యూరిటీల పోర్టుఫోలియో 91 బిలియన్ డాలర్లు ఉండగా, వాటిపై 15 బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని అమెరికా పత్రికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో చాలా బ్యాంక్‌ల పరిస్థితి ఇలానే ఉంది. బాండ్ల విలువ పడిపోవడంతో వాటిని విక్రయిస్తే భారీ నష్టాలు తప్పని పరిస్థితుల్లో ఉన్నాయి. జేపీ మోర్గాన్ బ్యాంక్‌కు 36 బిలియన్ డాలర్లు, వెల్స్‌ఫోర్గోకు 41 బిలియన్ డాలర్లు, సిటీ గ్రూప్‌కు 25 బిలియన్ డాలర్లు, గోల్డ్‌మెన్ శాక్స్‌కు 1 బిలియన్ డాలర్ల నష్టాలు ఇలా వచ్చినవే. బ్యాంక్ ఆఫ్ అమెరికా వద్ద నష్టాల్లో ఉన్న 221 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లు అమ్మకానికి ఉన్నాయని తలిపింది. ఇప్పటికే ఈ బ్యాంక్ బాండ్ల అమ్మకం ద్వారా 4 బిలియన్ డాలర్ల నష్ట పోయింది. అమెరికా బాండ్ల మార్కెట్ మూలంగానే బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటోందని నిపుణులు స్పష్టం చేశారు.
క్రెడిట్ సూయిస్‌కు 1 బిలియన్ ఆఫర్…
క్రెడిట్ సూయిస్ కొనుగోలుకు యూబీఎస్ గ్రూప్ 1 బిలియన్ డాలర్లకు ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ డీల్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని స్వీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కొనుగోలుకు సాఫీగా జరిగేందుకు అవసరమైతే వాటాదారుల ఓటింగ్‌కు అవకాశం లేకుండా నిబంధనలు మార్చాలని కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాచారం.. 167 సంవత్సరాల అత్యంత పూరతనమైన, ప్రపంచంలోనే అది పెద్ద బ్యాంక్‌ల్లో ఒకటైన క్రెడిట్ సూయిస్ సంక్షోభాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. సోమవారం నాడు మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించడం ద్వారా స్టాక్ మార్కెట్ల పతనాన్ని కొంత మేర నిలువరించవచ్చని భావిస్తోంది.
రెండు బ్యాంక్‌ల కలయికతో 10 వేల ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఉద్యోగాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు దీనిపై వెంటనే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని క్రెడిట్ సూయిస్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
యూబీఎస్ ఇచ్చిన ఆఫర్ మరీ తక్కువగా ఉందని క్రెడిట్ సూయిస్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. ఒక్కో షేరుకు 1.25 స్వీస్ ఫ్రాంక్‌లు చెల్లిస్తామని యూబీఎస్ ఆఫర్‌లో పేర్కొంది. శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్‌లో క్రెడిట్ సూయిస్ షేరు 1.86 స్వీస్ ఫ్రాంక్‌ల వద్ద ముగిసింది. దీంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. క్రెడిట్ సూయిస్ పతనానికి చాలా కాలంగా చాలా కారణాలు ఉన్నాయి. 2022లో ఈ బ్యాంక్ 7.3 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. 2004-08 మధ్య కాలంలో బల్గేరియాలో మాదకద్రవ్యాల డీలర్లకు మనీలాండరింగ్‌లో సాయం చేసినట్లు ఈ బ్యాంక్ పై వచ్చిన ఆరోణలు ఈ తరువా కాలంలో నిర్ధారణ కావడంతోనే క్రెడిట్ సూయిస్ పతనానికి నాంది. గత సంవత్సరం బ్యాంక్ డిపాజిట్లు 110.5 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఐరోపా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లు పెంచడంతో ఈ బ్యాంక్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లింది. యూబీఎస్ గ్రూప్ కొనుగోలు ప్రయత్నాలపైనే క్రెడిట్ సూయిస్ మనుగడ ఆధారపడి ఉంది.