Friday, November 22, 2024

సాగునీటి రంగానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: స్వర్ణయుగంతలపిస్తూ రాష్ట్రంలోని వ్యవసాయయోగ్యం భూములను సస్యశ్యామలం చేసేందుకు బడ్జెట్‌ లో నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత లభించింది. 2022లో రూ.22691 కోట్ల బడ్జెట్‌ ఉంటే ప్రస్తుతం అర్థిక సంవత్సరానికి రూ.26,885 కోట్ల రూపాయల బడ్జెట్‌ ను ప్రకటించింది. ప్రజల ఆశీస్సులతో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయి. మండు వేసవిలో మత్తడి దూకే చెరువులు, ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నీరు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పరవళ్లుతొక్కుతున్నాయని బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖమంత్రి హరీష్‌ రావు ఆనందం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్లు కేటాయించి 1200 చెక్‌ డ్యాంలనిర్మాణాలు చేపట్టినట్లు తెలుపుతూ ఈ చెక్‌ డ్యాంల నిర్మాణం నిరంతరంగా కొనసాగేందుకు,పూర్తి అయిన 650 చెక్‌ డ్యాంల మినహా మిగతా చెక్‌ డ్యాంల నిర్మాణానికి ప్రధాన్యత లభించింది.

రాజీవ్‌ ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచెనాలమేరకు రూ.13.84 కోట్లు, శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవపథకం రెండవ దశ పనులకు సవరించిన అంచెనాలను పరిశీలించి ప్రస్తుత బడ్జెట్‌ లో రూ. 20 కోట్లు కేటాయించారు. భూగర్భ జలాల పెంపు కోసం నిర్వహించే కార్యక్రమాలకు రూ.13.88 కోట్ల కేటాయింపు చేశారు. ఈ నిధులతో చెరువుల పునరుద్ధణ పనులు కూడా ఉన్నాయి. చొక్కారావు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కు రూ.58 కోట్లు, రాలువాగుకు రూ.4కోట్లు కేటాయింపులు జరిగాయి.

- Advertisement -

కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించకున్నా కాళేశ్వరం నిర్మించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా ను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు పనులను శరవేగంగా నిర్వహించేందుకు బడ్జెట్‌ లో స్థానం లభించింది. తెలంగాణకు స్వర్ణ కాంతులు అద్దుతూ అన్ని ప్రాంతాల సమాంతర అభివృద్ధి కోసం ప్రవేశపెటిన ఈ బడ్జెట్‌ తో నీటివనరులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు దర్పణం పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement