Friday, November 22, 2024

నిండుకుండల్లా సాగునీటి ప్రాజెక్టులు.. కృష్ణా, గోదావరిలో పూర్తిస్థాయిలో నీటిమట్టం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. దీంతో ఈ నదులపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్‌ నిండి నిండుకుండలా తొణకిసలాడుతోంది. ఇప్పటికే జలాశయం నిండడంతో అధికారులు 26 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3,23, 833 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా… ఔట్‌ఫ్లో 4, 03, 972 క్యూసెక్కులుగా ఉంది. సాగర్‌ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం 585.60 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్‌పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 299.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 3, 89, 362 క్యూసెక్కుల వరద వస్తుండగా… ఇప్పటికే ప్రాజెక్టు నిండడంతో 3, 79, 842 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువన అలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్ల నుంచి 4లక్షల క్యూసెక్కుల వరద , జూరాల నుంచి 2లక్షలా 70వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి లక్ష క్యూసెక్కుల వరద శ్రీశైలం దిశగా వస్తోంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌తోపాటు పులిచింతల ప్రాజెక్టు కూడా నిండడంతో వరద ఇక సముద్రం పాలుకాక తప్పదని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది లో వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నది ఇప్పటికీ ప్రమాదకరస్థాయిలోనే ప్రవహిస్తోంది. నదిలో వరద ప్రవాహం 50అడుగుల మేర ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌, కడెం, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులు ఇప్పటికే జలకళను సంతరించుకున్నాయి. కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు పూర్తి చేసి కిందకు దించడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7 టీఎంసీలకు గాను 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరాంసాగర్‌కు 17500 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 26, 663 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement