పత్తి కొనుగోళ్ల లో అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఆయన సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులకు రైతులు తీసుకొస్తున్న పత్తిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.
జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు మర్కెటింగ్ సెక్రటరీలు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులకు అవాంతరాలు ఎదురైతే వాట్సాప్ నెం.8897281111 సేవలు అందబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సొసైటీల్లో (డీసీఎంఎస్)లలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యలుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంత సొమ్ము అయితే దోపిడీ గురైందో తిరిగి వారి నుంచే రాబట్టాలని పేర్కొన్నారు. జిల్లాకు ఒక మోడల్ మార్కెట్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.