Monday, December 23, 2024

WGL | గంజాయిపై ఉక్కుపాదం.. నలుగురు అరెస్ట్

నలుగురు అరెస్టు
160 కిలోల గంజాయి, కారు స్వాధీనం

జిల్లా ఎస్పీ కిర‌ణ్ ఖారే

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, జ‌యశంక‌ర్‌ భూపాల‌ప‌ల్లి : గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపుతున్నామ‌ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. సోమ‌వారం గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అంతర్ రాష్ట్ర సభ్యుల ముఠాను భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేశార‌ని తెలిపారు. వారి నుంచి 160 కిలోల గంజాయి, షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

త‌మ‌కు అందిన స‌మాచారం మేర‌కు రవినగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ములుగు నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు తనిఖీ చేయగా 75 ప్యాకెట్లలో సుమారు 160 కిలోల గంజాయి ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు. కారులో ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌ల‌పేట మండ‌లం ద్వారాపూడికి చెందిన తోట మాధ‌వ‌రావు, ఒడిశా రాష్ట్రం చిత్ర‌కొండకు చెందిన‌ భీమ్‌ప్ర‌సాద్‌, ఒడిశా రాష్ట్రం ఠాక్రికి చెందిన సోమ‌రుటాక్రి అర్జున్‌, విశాఖ‌ప‌ట్నం సిటీ ద్వార‌కాన‌గ‌ర్‌కు చెందిన మ‌క్కువ మోసిస్‌ల‌ను అదుపులోకి తీసుకున్నామ‌న్నారు.

- Advertisement -

ఏపీ నుంచి గంజాయి ర‌వాణా..
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త‌వీధి మండలం దారకొండ గ్రామానికి చెందిన బాబురావు వద్ద 160 కిలోల గంజాయి కొనుగోలు చేసి భూపాలపల్లి పరిసర ప్రాంతాలలో అమ్మ‌డానికి తీసుకు వ‌చ్చారని ఎస్పీ తెలిపారు. తాము పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 40 లక్షలు ఉంటుందని అంచ‌నా వేశారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌న్నారు.

గంజాయి ర‌వాణా చేస్తున్న‌ నిందితులను పట్టుకోవడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్ రావు, సీసీఎస్ సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, చిట్యాల సీఐ డి.మల్లేష్, సీసీస్ ఎస్ఐలు ఏం సాంబమూర్తి, జె. రమేష్, ఘనపురం ఎస్సై ఆర్. అశోక్ సిసిఎస్ సిబ్బంది, గణపురం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement