ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లోని భారతీయుల రక్షణ తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మూడోసారి అధికారంలోకి వస్తే.. ఉద్రిక్తతలు చెలరేగుతున్న ప్రాంతాల్లో ఉన్న భారత పౌరుల జీవితాలకు భద్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాగా, సిరియాలోని ఎంబసీ కార్యాలయంపై వైమానిక దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ 300కి పైగా క్షిపణులు ప్రయోగించింది. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య తరచూ అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తంగా ఉంది. ప్రపంచ దేశాల్లో శాంతి లేదు. ఇటువంటి సమయంలో దేశ పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. విదేశాల్లో ఉంటున్న మన ప్రజల భద్రతే మా ప్రభుత్వం లక్ష్యం. యుద్ధ భయం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమయంలో పూర్తి మెజారిటీతో బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది ప్రజల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశాన్ని ఆర్థికంగా మరింత దృఢంగా మార్చే ప్రభుత్వం అవసరం. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ.. ‘విక్షిత్ భారత్’ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది” అని మోదీ చెప్పుకొచ్చారు.
స్వదేశానికి తరలించేందుకు చర్చలు
ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు జరిగిన సమయంలో కూడా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ చేపట్టింది. తద్వారా 1,309 మంది భారత పౌరులు, 14 మంది ఓసీఐ కార్డుదారులు, 20 మంది నేపాలీలను తరలించడం జరిగింది. అలాగే.. రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ సమయంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ గంగా ద్వారా 25వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది.