గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో విద్యార్థులతో హిందుమతానికి వ్యతిరేకంగా ప్రమానం చేయించారన్న అంశం ఇప్పుడు వివాదస్పదమౌతోంది. హిందూ దేవతలెవరినీ పూజించబోనని, బుద్ధుడు ప్రవచించిన సూత్రాలకు ఏమాత్రం వ్యతిరేకమైన విధంగా ప్రవర్తించబోనని వందలాది మంది ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వేరో పవిత్రమాసం కార్యక్రమ ప్రారంభంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధూళికట్ట గ్రామంలోని బౌద్ధక్షేత్రంలో పాలరాతి బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో అక్కడున్న వారందరితోనూ ఈ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా ఉండడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
ఈ అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అవుతున్నారు. ‘సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కుట్ర జరుగుతోంది. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయి? మీరు లెక్కలు తీస్తారా? కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీయించమంటారా?’ అని సంజయ్ ట్వీట్ చేశారు.
ఇక ఈ వివాదంపై స్పంధించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనిపై విచారం వ్యక్తంచేస్తూ ప్రకటన విడుదలచేశారు. ధూళికట్ట గ్రామంలో బుద్దుడి విగ్రహఏర్పాటు కార్యక్రమంలో ఒక బౌద్ధ కుటుంబం బుద్ధ వందనాన్ని, అంబేద్కర్ బౌద్ధధర్మాన్ని స్వీకరించినప్పుడు చేసిన ప్రమాణాన్ని చదువగా అందరూ చదివారని.. దీనిపై అక్కడికక్కడే.. వేదికపైనే వివరణ ఇచ్చామని చెప్పారు. దీనివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తాను విచారం వ్యక్తంచేస్తున్నానన్నారు. సంబంధిత బౌద్ధ కుటుంబంతో తనకు గాని స్వేరోస్ కుటుంబసభ్యులకు గాని ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు.