Friday, November 22, 2024

క్రికెట్‌ పండుగ వచ్చేసింది.. రేపటి నుంచి ఐపీఎల్‌ -16 షురూ

ప్రపంచంలోనే అతిపెద్ద టీ-20లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) 16వ సీజన్‌ వచ్చేసింది. రేపటి నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ప్రారంభ వేడుకలకు వేదికవుతోంది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఐపీఎల్‌ కొత్త సీజన్‌ అట్టహాసంగా మొదలవుతుంది. ఈ వేడుకను కన్నులపండువగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్నిఏర్పాట్లు చేసింది. సినీ సెలబ్రిటీలు, బాలీవుడ్‌ సింగర్స్‌తో బీసీసీఐ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. తెలుగు, కన్నడతో పాటు బాలీవుడ్‌లోనూ పాపులర్‌ అయిన రష్మిక మందాన, మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా డాన్స్‌తో అలరించనున్నారు.

బాలీవుడ్‌ ఫేమస్‌ సింగర్‌ అర్జిత్‌సింగ్‌ పాటలతో హోరెత్తించనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరిస్తారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటన్స్‌, నాలుగుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఓపెనింగ్‌ సెర్మనీకి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్ని, కార్యదర్శి జైషాతో పాటు పలువురు రాజకీయ, క్రికెట్‌ ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారు.

ఈ సీజన్‌ ప్రత్యేకతలివే

గత సీజన్లతో పోల్చితే ఈసారి ఐపీఎల్‌ సరికొత్తగా ఉండనుంది. టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ కొన్నికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ప్రతి జట్టు సొంత మైదానంలో ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి టీమ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను తీసుకొనే వెసులుబాటును కలిగివుంటుంది. దాంతో అదనపు బ్యాటర్‌ లేదా బౌలర్‌ను పొందేందుకు వీలుంటుంది. ఇక టాస్‌ తర్వాత కూడా తుది జట్టులో మార్పులు చేసుకొనే సౌలభ్యం ఉండటం మరొక ఆకర్షణీయ మార్పు.

- Advertisement -

అయితే, అసాదారణంగా కురుస్తున్న వానల కారణంగా ఇప్పటినుంచే పిచ్, వాతావరణం గురించి చర్చ మొదలైంది. సాధారణంగా ఐపీఎల్ పిచ్‌లపై తేమ ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. రేపు రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement