Friday, November 22, 2024

ఏపీలో ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం

కొత్తగా ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2022 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెడ్యూల్ విడుదల చేశారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ తెలిపారు. వారితో పాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి కూడా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

షెడ్యూల్‌ ఇలా..

★ ఆగస్టు 9 నుంచి అక్టోబర్‌ 31 వరకు ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన
★ నవంబర్‌1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
★ నవంబర్‌ 30 వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి
★ నవంబర్‌ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమం
★ అదే తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు
★ ఆ పోలింగ్‌ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు
★ http://www.nvsp.in లేదా వోటర్‌ హెల్ప్‌లైన్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
★ డిసెంబర్‌ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి
★ జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల.

ఓటర్ల జాబితా సిద్ధం చేయండి
ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రచురించాలని ఆయన పేర్కొన్నారు. దీంతో నగర పంచాయతీల్లో అన్ని వార్డుల్లో మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement