Tuesday, November 19, 2024

Hajj Yatra | హజ్‌-2024 యాత్రకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మక్కాలో హజ్‌-2024 యాత్ర కోసం తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకుంటున్న భక్తులు ఈ నెల 20వ తేదీ లోపే ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హజ్‌ కమిటీ నేతృత్వంలో పని చేసే తెలంగాణ హజ్‌ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన ముస్లిం మైనారిటీల నుంచి దరఖాస్తులను కోరుతుంది.

ఆన్‌లైన్‌లో చేసుకునే దరఖాస్తులకు ఎలాంటి రుసుము లేదని, అయితే ఎంపికైన అభ్యర్థుల నుంచి మాత్రమే తొలి విడత అడ్వాన్స్‌ చెలించే రూ.81,500లతో సహా అదనంగా రూ.300లు చెల్లించాల్సి ఉంటుంది. హజ్‌-2024 యాత్రకు ఎంపిక కాని యాత్రికులు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. మాన్యువల్‌గా ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబడవు. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికుల పాస్‌పోర్టు ఈ నెల 20వ తేదీ లోపు జారీ అయి ఉండాలని, అలాగే వ్యాలిడిటీ 2025 జనవరి 31వ తేదీ వరకు తప్పనిసరిగ ఉండాల్సి ఉంది. లేదంటే వెబ్‌సైట్‌లో దరఖాస్తు స్వీకరించబడవు.

జీవితంలో కేవలం ఒక్కసారే హజ్‌ కమిటీ ద్వారా యాత్రకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మెహ్రం (షరియత్‌ చట్టం ప్రకారం మహిళతో ప్రయాణించే భర్త లేదా, కొడుకు తదితరులు) 70 ఏళ్ల పైబడిన వ్యక్తులకు తోడుగా ప్రయాణించే వారికి కేంద్ర హజ్‌ కమిటీ నిబంధనలకనుగుణంగా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర హజ్‌ కమిటీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేథ్యంలో బుధవారం ఉదయం 11.15 గంటలకు నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ భవనం ఆవరణలో ఛైర్మన్‌ ముహమ్మద్‌ సలీం హజ్‌ యాత్రకు సంబంధించిన వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement