Tuesday, January 7, 2025

TG | షరతులు లేకుండా పెట్టుబడి సాయం : డిప్యూటీ సీఎం భట్టి

  • వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
  • మూడు 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన
  • జనవరి 26 నుండి రైతు భరోసా
  • రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు అండగా ప్ర‌జా ప్ర‌భుత్వం

గ‌త పదేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను బీఆర్ఎస్ మోసం చేసింద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ… నేడు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బీఆర్‌ఎన్‌ నాయకుల అసమర్థ పరిపాలన వల్లనే అని విమర్శించారు.

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో రైతులకు న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.8.4 కోట్లతో నిర్మించనున్న మూడు 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఎన్ని కుట్రలు చేసినా రైతు భరోసా అమలు చేసి తీరుతాం

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు… ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే రూ.లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేశామని, మరికొద్ది రోజుల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతులకు భరోసా కల్పిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డొచ్చినా.. ఎన్ని కుట్రలు చేసినా రైతు భరోసా అమలు చేస్తామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

జనవరి 26 నుంచి ఈ కార్యక్రమం చేపడతామని, రైతులతో పాటు భూమిలేని రైతు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఆత్మ భద్రత పేరుతో భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని ప్రకటించారు.

కేటీఆర్, హరీశ్ రావు అడ్డ‌గోలుగా మాట్లాడుతున్నారు…

బీఆర్ఎస్ పార్టీ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్ రావు మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దుష్ప్రచారం చేసేందుకు కొన్ని మీడియా ఛానళ్లను వాడుకుంటున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వ‌చ్చిన తర్వాత 56 వేల మందికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని భట్టి అన్నారు. ఇచ్చిన మాటలను నిలబెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తేకునేలా ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భట్టి విక్రమార్క సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement