Sunday, November 24, 2024

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని, కంపెనీలను కోరిన కేటీఆర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ 14 రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని, సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండి ఎవరికుండే బలాబలాలు వారికున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా కంపెనీలను సాదరంగాఆహ్వానిస్తున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో అప్‌డేట్‌ టు ఇండియా ఎకనమిక్‌ స్ట్రాటజీ-2035 అనే అంశంపై ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. జూన్‌ 28న ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ హబ్‌ నుప్రారంభిస్తున్నామన్నారు. ఆవిష్కరణల్లోనూ ఆస్ట్రేలియా వారిని భాగస్వాములవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అతిపెద్ద లైఫ్‌సైన్సెస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా వారి సహకారం ఆశిస్తున్నామన్నారు. ‘ హైదరాబాద్‌ను పెట్టుబడులకు అనుకూల నగరంగా గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రతిష్టాత్మక సంస్థ మెర్సర్‌ హైదరాబాద్‌ నివాసయోగ్యమైన నగరమని 2015 నుంచి వరుసగా పేర్కొంది.

యూఎస్‌ కాన్సులేట్‌ హైదరాబాద్‌లోనే ప్రపంచంలో అత్యధిక వీసాలు ఇస్తోంది. ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌(సీజీ) కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయండి. భారత్‌లో పెట్టుబడులుపెట్టాలనుకుంటే తెలంగాణ గేట్‌వేలాంటిది. పెట్టుబడులకు సంబంధించి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా సెల్ఫ్‌సర్టిఫికేషన్‌తో ఆన్‌లైన్‌లో పరిశ్రమలకు అనుమతులిచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో అనుమతులకు 3 నెలలదాకా సమయం పడుతుంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 15 లక్షలకుపైగా ఉద్యోగాలు వచ్చాయి. ఒకసారి పెట్టుబడి పెట్టిన వారే తిరిగి పెట్టుబడులుపెడుతుండడమే తెలంగాణకు ప్రత్యేకత. తెలంగాణలో 90 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాం. దక్షిణ, ఉత్తరభారతదేశాలు కలిపే నగరం హైదరాబాద్‌. ఇక్కడ డేటాసైన్సెస్‌, లైఫ్‌సైన్సెస్‌తో కలుస్తాయి. వరంగల్‌లో ప్రారంభించిన టెక్స్‌టైల్‌ పార్కు ప్రపంచంలోనే పెద్దది. త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ఫార్మాసిటీని త్వరలో ప్రారంభించబోతున్నాం. ఎలక్ట్రానిక్స్‌,ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ రంగాల్లోనూ ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. హెదరాబాద్‌ నగరాన్ని దేశంలోనే హబ్‌ అండ్‌ స్పోక్‌ లాగావాడుకోండి. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా, తెలంగాణ వ్యాపారవేత్తలు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement