Tuesday, November 26, 2024

కీవ్‌పై దండయాత్ర, సరిహద్దులో హోరాహోరీ పోరు.. ఖర్కీవ్‌పై కన్నేసిన రష్యన్‌ ఆర్మీ

ఉక్రెయిన్‌పై రష్యా దండ యాత్ర కొనసాగుతూనే ఉంది. పోర్టు సిటీ ఖెర్సన్‌ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రష్యా.. రాజధాని కీవ్‌తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే ఉక్రెయిన్‌ మాత్రం పట్టు వదలడం లేదు. దీంతో భారీ ఎత్తున పేలుళ్లు సంభవిస్తున్నాయి. కీవ్‌ శివార్లలో ఇరు దేశాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌తో పాటు మూడు టీవీ, రేడియో స్టేషన్లపై క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ఆఫీసు వీటికి దగ్గర్లోనే ఉంది. కీవ్‌తో పాటు ఒబ్లాస్ట్‌, ల్వీవ్‌, రి&ుతోమిర్‌, ఫ్రాంకివ్‌స్క్‌, చెర్నిహివ్‌, ఒడెస్సాలోనూ వైమానిక దాడులకు సైరన్‌లు మోగించింది. చెర్నిహివ్‌లోని ఓ ఆస్పత్రిపై రెండు క్రూయిజ్‌ మిసైళ్లతో దాడి చేశారు. ఆస్పత్రి ప్రధాన భవనం ధ్వంసం అయ్యింది. సుమారు 25 మంది వరకు చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. మరియుపోల్‌లో రష్యా షెల్లింగ్‌ కొనసాగుతూనే ఉంది.

జనావాసాలే లక్ష్యంగా దాడులు..

ఖర్కీవ్‌లోనూ జనావాసాలే లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులకు దిగుతున్నది. ఖెర్సన్‌ చేజారడంతో.. ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రధాన పోర్టు, నేవల్‌ బేస్‌ అయిన ఒడెస్సా వైపు రష్యా సైన్యం కదులుతున్నది. ఇక్కడ భారీ స్థాయిలో షిప్పుల ద్వారా దాడి జరిగే అవకాశం ఉందని, రెండు వైపులా భీకర పోరాటం జరగొచ్చని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. రష్యా నిరంతరం ఫైరింగ్‌ చేస్తుండటంతో.. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి చేర్పించలేకపోతున్నామని మరియుపోల్‌ మేయర్‌ వాడిమ్‌ బోయిచెన్కో తెలిపారు. అదేవిధంగా ఎనర్హోదర్‌ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు కదులుతున్నాయి. ఉక్రెయిన్‌కు నాల్గో వంతు ఇక్కడి నుంచే విద్యుత్‌ సరఫరా అవుతుంది. ముందుగా విద్యుత్‌ ఇబ్బందులు సృష్టించి.. ఆపై దాడికి యత్నించాలనే లక్ష్యంతో రష్యన్‌ ఆర్మీ వ్యూహాన్ని రచిస్తున్నది. ఖర్కీవ్‌లోని ఓ పోలీసు విభాగ భవనం, ఓ యూనివర్సిటీలోని కొంత భాగం రాకెట్‌ దాడికి దెబ్బతిన్నది.

మరియుపూల్‌లో భారీ నష్టం..

రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉక్రెయిన్‌ నగరం మరియుపూల్‌లో కొన్ని గంట పాటు దాడులు జరిగాయి. భారీ ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని ఉక్రెయిన్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1,30,000 మంది నివాసం ఉంటున్న ఈ రాష్ట్రం మొత్తం ధ్వంసమైందని డిప్యూటీ మేయర్‌ సెర్గీ ఓర్లోవ్‌ తెలిపారు. బాధితులను లెక్కించే పరిస్థితి లేదని, కానీ వందల కొద్దీ పౌరులు మరణించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు లోపలికి వెళ్లలేని పరిస్థితి అని చెప్పుకొచ్చారు. రష్యా దళాలు అన్ని రకాల ఆయుధాలను ఇక్కడ ప్రయోగిస్తున్నాయని, ఫిరంగులు, అనేక రాకెట్లను ఒకేసారి ప్రయోగించగల ఆయుధాలు, వ్యూహాత్మక రాకెట్లు, నగరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఓర్లోవ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ ఆర్మీ ఎంతో ధైర్యంగా పోరాడుతోందని, నగరాన్ని రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. రష్యా దళాలు సముద్రపు దొంగల్లా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement