ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు పెంచిందనడానికి ఓ చిత్రం స్పష్టం చేస్తున్నది. ఉప గ్రహ చిత్రాలు ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కీవ్‌లోకి చొరబడేందుకు రష్యా బలగాలు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కీవ్ వైపు రష్యా సేనలు చాలా వేగంగా ముందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ను ఉప గ్రహ చిత్రాలు మంగళవారం గుర్తించాయి. దీని పొడవు.. 65 కిలో మీటర్లు (40 మైళ్లు) ఉన్నట్టు ఉప గ్రహ చిత్రాల ఆధారంగా అంచనా వేశారు. సోమవారం గుర్తించిన 27 కిలోమీటర్ల పొడవు ఉన్న కాన్వాయ్ కంటే ఇది చాలా పెద్దదని తెలిపాయి. ఉక్రెయిన్ నగరాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎయిర్ సైరెన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్‌తో పాటు పశ్చిమ నగరాలైన టెర్రోపిల్, రివ్నే తదితర ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయని స్థానికులు తెలిపారు. కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకోవడానికి రష్యా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైనికులు.. ప్రాణాలకు సైతం లెక్క చేయడంలేదు.
మాక్సర్ టెక్నాలజీ చిత్రాలు విడుదల..
మాక్సర్ టెక్నాలజీ ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. రష్యా కాన్వాయ్ ఆంటోనోవ్ విమానాశ్రయం దగ్గర నుంచి ప్రైబిర్స్క్ పట్టణం వరకు ఉన్న రహదారిని కవర్ చేస్తున్నది. కాన్వాయ్ ప్రయాణిస్తున్న రోడ్ల సమీపంలో ఇవాన్కివ్‌కు ఉత్తరం, వాయువ్య దిశలో అనేక గృహాలు, భవనాలు ధంసం అయినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయని మాక్సర్ వెల్లడించింది. ఉక్రెయిన్ ఉత్తర సరిహద్దుకు 32 కిలోమీటర్ల దూరంలోని బెలారస్ దక్షిణ ప్రాంతంలో అదనపు సైనిక బలగాలు, యుద్ధ హెలికాప్టర్ విభాగాలను గుర్తించినట్టు తెలిపింది. గత గురువారం రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రేనియన్ దళాలు రాజధానిని చుట్టుముట్టిన రష్యన్ దళాలకు వ్యతిరేకంగా సెంట్రల్ కీవ్‌లోకి వెళ్లే రహదారులను రక్షిస్తున్నాయి. కాగా కీవ్‌కు సేచ్ఛగా వెళ్లేలా ఒక హైవే విడిచిపెట్టాలని రష్యా సైన్యం నిర్ణయించింది.
ఐరోపా దేశంపై ఇదే అతిపెద్ద దాడి..
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ దాడుల్లో పలువురు ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత.. ఒక ఐరోపా దేశంపై ఇంత పెద్ద స్థాయిలో దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి. రష్యా దాడిలో ఇప్పటి వరకు 350కు పైగా ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాము ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడం తమ ఉద్దేశం కాదని.. సైనిక సామర్థ్యాలను నాశనం చేయడం.. ప్రమాదకరమైన జాతీయవాదులుగా భావించే వారిని అణిచివేయడమే తమ లక్ష్యం అని రష్యా ప్రకటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..