Thursday, November 21, 2024

Delhi | ఐఎన్‌టీయూసీ సంజీవ రెడ్డి వర్గానికే గుర్తింపు.. విబేధాలు, చీలికల పరిష్కారానికి కమిటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ అనుబంధ కార్మిక విభాగం ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ)లో జి. సంజీవరెడ్డి నేతృత్వంలోని చీలికవర్గానికే గుర్తింపునిస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. ట్రేడ్ యూనియన్లో విబేధాల నేపథ్యంలో నిట్టనిలువుగా రెండుగా చీలిన నేపథ్యంలో ఏఐసీసీ అధినేత్రి ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరిన విషయం తెలిసిందే. మల్లికార్జున ఖర్గే, దిగ్విజయన్ సింగ్‌తో కూడిన ఈ కమిటీ ఐఎన్‌టీయూసీలో జరుగుతున్న పరిణామాలపై అంతర్గత దర్యాప్తు జరిపి నివేదికను అందజేసింది. జి. సంజీవరెడ్డి నేతృత్వంలోని ట్రేడ్ యూనియన్‌కే ఎక్కువ సంఖ్యలో సభ్యత్వం, అనుబంధ యూనియన్లు ఉన్నాయని కమిటీ నిర్థరించింది.

ఈ నివేదిక ఆధారంగా సంజీవ రెడ్డి నేతృత్వంలోని ఐఎన్‌టీయూసీకే గుర్తింపునిచ్చినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ పేరిట ఒక ప్రకటన జారీ చేసింది. అదే సమయంలో ఖర్గే, దగ్విజయ్ సింగ్‌తో కూడిన కమిటీలో సూచించిన మేరకు చీలిక వర్గాలకు నేతృత్వం వహిస్తున్న సంజీవ రెడ్డి, సీఎస్ దూబేలను సామరస్యంగా యూనియన్ అంతర్గత సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ఏఐసీసీ సూచించింది. అలాగే పరస్పరం ఒకరిపై ఒకరు వేర్వేరు న్యాయస్థానాల్లో దాఖలు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని సూచించింది. వీలైనంత త్వరలో ఐఎన్‌టీయూసీలో ఎన్నికలను నిర్వహించుకోవాలని ఏఐసీసీ ఆదేశించింది.

కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘంలో చోటుచేసుకున్న పరిణామాలు, విబేధాల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఏఐసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత తారిఖ్ అన్వర్‌ను కన్వీనర్‌గా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్, పార్టీ ఎంపీలు కే. మురళీధరన్, రాజమణి పాటిల్, పార్టీ నేత ఉదిత్ రాజ్‌లను సభ్యులుగా నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement