హైదరాబాద్, ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మైనర్ల కస్టడీ విచారణకు తొలిరోజు ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో విచారణ జరగలేదు. అత్యాచారం కేసులో మైనర్లకు ఐదు రోజుల కస్టడీకి జువెనల్ జస్టిస్ బోర్డు అనుమతించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉంది. కానీ తొలిరోజు అది సాధ్యం కాలేదు. ఈ కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నప్పటికీ అయిదుగురూ మైనర్లే. వీరిలో ముగ్గురిని బోర్డు ఐదు రోజుల కస్టడీ విచారణకు అనుమతిస్తూ న్యాయవాది సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది.
అయితే మైనర్లను విచారించేందుకు హోమ్‌లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీసులు హోమ్ నిర్వాహకులను కోరారు. పోలీసుల కోరికను నిర్వాహకులు అసహాయత వ్యక్తం చేయడంతో తొలి విచారణకు బ్రేక్ పడింది. హోమ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు నిర్వాహకుడు నిరాకరించడంతో శనివారం నుంచి ముగ్గురు మైనర్లను పోలీసుస్టేషన్‌లోనే విచారించాలని పోలీసులు నిర్ణయించారు. శనివారం ఉదయం గం. 10 లకు పోలీసులు జువెనల్ హోం నుంచి మైనర్లు ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు తీసుకు వెళ్ళి సాయంత్రం గం. 5 వరకు ప్రశ్నించనున్నారు.