అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం ఆఖరి సమయంలో నిలిచిపోయింది. మరో 40 నిముషాల్లో రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందనగా రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. హైడ్రోజన్ లీకేజీ కారణంగా సోమవారం నాటి కౌంట్‌డౌన్‌ను మధ్యలో నిలిపివేశారు. టి మైనస్ 40 నిముషాల వద్ద కౌంట్‌డౌన్ ఆపేసినట్లు నాసా తెలిపింది. ఆర్టెమిస్ లాంచ్ డైరెక్టర్‌తో మిషన్ ప్రణాళికలను హైడ్రోజన్ ఇంజనీర్ల బృందం చర్చిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్‌ఎల్‌ఎస్) రాకెట్‌లోని ఆర్‌ఎస్-25కు జోడించబడిన ఇంజిన్-3లో హైడ్రోజన్ లీకేజీ సమస్య తలెత్తింది. ఇంజనీర్లు సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. కానీ, లీకేజీ నివారణకు వెంటనే నియంత్రణలోకి రాలేదు. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇంజినీర్లు సమస్యను వీలైనంత త్వరగా అధిగమిస్తే, బహుశా సెప్టెంబర్ 2న శుక్రవారం రాకెట్ ప్రయోగం జరిగే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో మహత్తర ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోపాటు వందలాది మంది ప్రజలు నిరాశకు గురయ్యారు. ఆర్టెమిస్ లాంచ్ కంట్రోల్ ప్రకటన ప్రకారం, ఇంజిన్-3లోని లోపలి ట్యాంక్‌పై కోర్ స్టేజ్ వెలుపలి భాగంలో ప్లాంజ్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ మెటిరియల్‌లో పగుళ్లను నిపుణుల బృందాలు అంచనా పరిశీలిస్తున్నాయి. ఆర్టెమిస్-1 కోసం నాలుగు ఆర్‌ఎస్-25 ఇంజన్లు కోర్‌స్టేజికి జోడించ బడ్డాయి. ఇందులోని మూడవ నంబర్ ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. రాకెట్ నింగికి ఎగరడం ప్రారంభించాక నాలుగు ఇంజిన్లు సుమారు 2 మిలియన్ పౌండ్ల శక్తిని అందిస్తాయి.