ప్రస్తుతం ఉన్నది ఇంటర్నెట్ ప్రపంచం. క్షణం పాటు నెట్ లేకపోయినా పరుగులు పెట్టే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. అలాంటి మంగళవారం ఉదయం ఒక్కసారి కాదు పలుమార్లు ఇంటర్నెట్కు అంతరాయం కలిగింది. దీంతో ప్రముఖ సోషల్ మీడియా, ప్రభుత్వ, న్యూస్ వెబ్సైట్లు పనిచేయలేదు. అమెరికాకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన ఫాస్ట్లీలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగినట్లు కొన్ని వార్తలు చెబుతున్నాయి. రాయ్‌టర్స్ మాత్రం వెబ్సైట్లు ఆగిపోయిన అంశంపై స్పందించలేదు. తమ సీడీఎన్ సర్వీసుల పనితీరుపై ప్రభావం చూపిన అంశాలపై తాము విచారణ జరుపుతున్నట్లు ఫాస్ట్లీ వెల్లడించింది.
ఫాస్ట్లీ కవరేజ్ ప్రాంతాల్లోని వెబ్సైట్ల పనితీరు మందగించినట్లు ఆ సంస్థ వెబ్సైట్ తెలిపింది. అమెజాన్ వెబ్సైట్ కూడా కాసేపు పని చేయలేదు. 21 వేల మంది రెడిట్ యూజర్లు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సరిగా పని చేయడం లేదని ఫిర్యాదు చేయగా.. 2 వేల మంది అమెజాన్ గురించి ఫిర్యాదు చేశారు. అమెజాన్‌కే చెందిన ట్విచ్ కూడా సరిగా పని చేయలేదు. ఇక ఫైనాన్షియల్ టైమ్స్, ది గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బర్గ్ న్యూస్ వంటి న్యూస్ వెబ్సైట్లపై కూడా ఈ అవుటేజ్ ప్రభావం చూపింది.