న్యూఢిల్లీ – అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ, యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని చెప్పారు. ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటని కొనియాడారు. ఇది మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ఇక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో సూరత్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో లక్ష మంది పాల్గొని యోగాసనాలు వేశారు.