అమరావతి, ఆంధ్రప్రభ: త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ సిలబస్‌ను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. మన ప్రభుత్వ పాఠశాలల్లో చదవిఏ పేద విద్యార్ధులు ప్రపంచ స్థాయిలో ఎదగడమే కాకుండా ఎగిరేలా విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. తాము తెస్తున్న మార్పులు కారణంగా ఈనాటి పేద విద్యార్ధులు రేపటి రోజున ప్రపంచాన్నే ఏలతారన్నారు. చదవులో ఎన్నో మార్పులు వస్తున్నాయని, ఆ మార్పులకనుగుణంగా పేద విద్యార్దులకు విద్యను అందించాల్సిన అవసరం ఉందని, తద్వారానే వారు గ్లోబల్ సిటిజన్స్‌గా మారే అవకాశముందన్నారు. ఇందులో భాగంగానే త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బకాలారియేట్ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల ల్లో ఇంగ్లీస్ మీడియంను, సిబిఎస్‌ఇ సిలబస్‌ను ప్రవేవపెట్టినట్లు చెప్పారు. మంగళవారం పది, ఇంటర్, ఉన్నత విద్యలో రాష్ట్ర స్తాయిలో ప్రధమ స్థానంలో నిలిచిన విద్యార్ధులకు సిఎం జగన్ పురస్కారాలిచ్చి సన్మానించారు. ఆ సందర్బంగా సిఎం జగన్ మాట్లాడుతూ పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విద్యలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చామని, ఎనిమిదో తరగతి నుండి విద్యార్దులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాప్‌లను అందిస్తున్నామని, ఇతర తరగతుల విద్యార్ధులకు కూడా బైజూస్ కంటెంట్‌ను అందిస్తున్నామని చెప్పారు.
మూడో తరగతి నుండే సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేశామని, కరిక్యులమ్‌ను కూడా మార్చామని చెప్పారు. ఇంగ్లీ ష్‌లో ప్రావీణ్యం సాధించేందుకు మూడో తరగతి నుండే టోఫెల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రయివేట్ బడులు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడాల్సిన పరి స్థితిని కల్పిస్తున్నామని, ప్రతి విద్యార్ధి కనీసం డిగ్రీ వరకు చదవాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తమ పిల్లలను డిగ్రీ చదివించేందుకు తల్లితండ్రులు అప్పులు పాలవ్వకుండా ఉండేందుకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లోని ప్రముఖ కాలేజీల్లో సీటు తెచ్చుకున్న విద్యార్ధులకు కోటీ రూపాయల పైన ఫీజు ఉన్నప్పటికీ చెల్లిస్తున్నట్లు చెప్పారు. చిన్న తనం నుంచే అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యాలను మన పేద పిల్లలు పెట్టుకోవాలన్నారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా మన చదవులు ఉండాలన్నారు.
విద్యకు అధిక ప్రాధాన్యం : మంత్రి బొత్స సత్యనారాయణ
రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్ధుల్లో స్పూర్తిని నింపాలని, వారి మధ్య పోటీ తత్వాన్ని పెంచాలనే లక్ష్యంతో జగనన్న అణిముత్యాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున ట్లు చెప్పారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్య అంటే సంక్షేమం కాదు పెట్టుబడి అని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతోందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్ధులు పోటీ పడేలా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి బొత్స తెలిపారు. అనంతరం సిఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పదో తరగతి వివిధ ప్రభుత్వ స్కూళ్ల విభాగాల్లో మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన 42 మందికి, ఇంటర్‌లో నాలుగు గ్రూపుల్లో ప్రధమ స్థానంలో నిలిచిన 26 మందికి, ఉన్నత విద్యలో ప్రావీణ్యాన్ని చూపించిన 20 మంది విద్యార్ధులకు నగదు ప్రోత్సాహకం తోపాటు మెడల్స్, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.